హైదరాబాద్‌లో ఫేక్ బర్త్, ఫేక్ డెత్ సర్టిఫికెట్లపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంబంధిత విభాగం అధికారులపై మేయర్ వేటు వేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ముఖ్యంగా సీఎంఓహెచ్, స్టాటిస్టికల్, ఏఎంఓహెచ్, ఏఎంసీలపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. కాగా, నకిలీ సర్టిఫికెట్లపై మేయర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే, అత్యవసర భేటీకి ముందే సీఎంహెచ్‌ను మేయర్ విజయలక్ష్మి తన చాంబర్‌కు పిలిచి ఫైర్ అయ్యారు. ఎందుకిలా జరిగిందో చెప్పాలని.. లోపం ఎక్కడుందని మండిపడ్డారు. కమిషనర్ ఎదుటే సీఎంఓహెచ్‌పై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు జారీ విషయంలో బాధ్యులైన అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకోనున్నారు. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఇందుకు బాధ్యులైన వారిపై జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.
ఫేక్ సర్టిఫికెట్ల విషయంపై విజిలెన్స్ అధికారుల విచారణకు కమిషనర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. సుమారు 20 వేల దొంగ సర్టిఫికెట్లు వెలుగు చూడడంపై విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహించారు. కాగా, దీనిపై కమిషనర్‌కు విజిలెన్స్ అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. విజిలెన్స్ నివేదికలో ఇంటి దొంగల వివరాలను కూడా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. భాద్యులైన అధికారులను సొంత డిపార్ట్‌మెంట్‌లకు పంపాలా? లేదా సస్పెండ్ చేయాలా అనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ను ఎందుకు ఆ పదవి నుంచి తప్పించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. అదే వేరే వాళ్లు ఉండి ఉంటే.. సీఎం కేసీఆర్ యాక్షన్ మరోలా ఉండేదని సైటెర్లు వేశారు.