అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీదారుల నిర్వాకం
వినియోగదారుల షాక్…
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
పెద్ద నగరాల్లోనే కాదు చిన్న చిన్న పల్లెల్లో కూడా వినియోగదారులను నిండా ముంచేందుకు వెనకడాడడం లేదు నిర్వాహకులు. ఆహారాన్ని కల్తీ చేయకూడదన్న నిబంధనలు ఉన్నా కూడా పట్టించుకునే వారు కరువయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్తీపై కొరడా ఝులిపిస్తున్నా కొంతమంది నిర్వాహకులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
నిమ్మపల్లి కేంద్రంగా…
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపల్లి కేంద్రంగా తయారవుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుగోలు చేసిన వినియోగదారులు షాకుకు గురయ్యారు. మండలంలోని మరిమడ్ల గ్రామంలోని ఓ షాపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుగోలు చేశారు. అరకిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుగోలు చేసిన స్థానికులు డబ్బా నుండి వాసన చూసి ఆశ్చర్యపోయారు. అల్లం వెల్లుల్లి వాసన కాకుండా కుళ్లిపోయినట్టుగా వస్తుండడంతో అనుమానించి డబ్బాను పరికించి చూశారు. ఇంకా జనవరి నెల ముగియకముందే డబ్బాపై మాత్రం ఫిబ్రవరి నెలలో తయారు చేసినట్టుగా ముద్రించి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. మరో మూడు రోజుల తరువాత రావల్సిన ఫిబ్రవరి నెల అల్లం వెల్లుల్లి పేస్ట్ నిర్వహాకులకు ముందే ఎలా వచ్చిందని అనుమానించారు. నిమ్మపల్లిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నిర్వాహకులు అడ్వాన్స్ డేట్ వేసి మార్కెట్లో విక్రియించేందుకు పంపిస్తున్నట్టుగా గుర్తించారు. తాము కొనుగోలు చేసిన ఈ పేస్ట్ పై ఫిబ్రవరి 2025అని మాత్రమే ఉందని డేట్ కూడా వేయకుండా ముద్రించారని వినియోగదారులు ఆరోపించారు. జనవరి 28న మరిమడ్లలోని రిటేల్ షాపులో విక్రయించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీదారులు రెండు మూడు రోజుల ముందే పంపించి ఉంటారని… ఈ లెక్కన సదరు కంపెనీ అడ్వాన్స్ డేట్లు వేస్తోందని స్పష్టం అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
5 కేజీల స్టిక్టర్…
మరో వైపున అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాపై ముద్రించిన వివరాలు అత్యంత విచిత్రంగా ఉన్నాయి. అయోధ్య రామ్ ఫుడ్ ప్రాడక్ట్స్ తయారు చేసినట్టుగా ముంద్రించిన ఈ స్టిక్కర్ పై 5 కిలోలు ఉందని రూ. 490 అన్న వివారలు కనిపిస్తున్నాయి. అయితే వినియోగదారులు మాత్రం 500 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుగోలు చేసిన డబ్బాపై ముద్రించడం గమనార్హం. ఈ లెక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాపై వేస్తున్న స్టిక్కరింగ్ కూడా నకిలీదేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ఇదే తయారీదారులు వేర్వేరు పేర్లతో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తున్నట్టుగా రిటేల్ షాపుల్లో విక్రయిస్తున్న బాక్సులను గమనిస్తే స్పష్టం అవుతోందని వినియోగదారులు తెలిపారు.
రూరల్ ఏరియా మొత్తం…
కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో తయారవుతున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కొనరావుపేటతో పాటు పలు ప్రాంతాల్లోని రిటేల్ షాపులకు సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా తయారు చేస్తున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తిని అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ పేస్ట్ కొనుగోలు చేసిన వినయోగదారులు ఆహార పదార్థాల్లో కలుపు్కుని తిన్నట్టయితే ఉదర సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నందున అధికారులు దాడులు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.
లైసెన్స్ ఉందా..?
ఆహారా పదార్దాలను తయారు చేసి విక్రయించేందుకు Food Safety and Standards Authority of India (FSSAI) నుండి అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. ఈ విభాగం నుండి అనుమతులు తీసుకోకుండా విక్రయించినట్టయితే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయనున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఒకవేళ FSSAI లైసెన్స్ తీసుకుని కూడా విక్రయించినట్టయితే కల్తీ ఆహార చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. అంతేకాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రం నిబంధనల మేరకు ఏర్పాటు చేశారా లేదా అని కూడా తేల్చాల్సిన అవశ్యకత ఉంది. ఒకే అడ్రస్ పై వేర్వురు కంపెనీల పేరిట అల్లం వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తున్న తీరును గమనిస్తే మరిన్ని అనుమానాలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. UV3R NMP266 అనే బ్యాచ్ నెంబర్ కూడా స్టిక్కర్ పై ముద్రించి ఉన్నందున ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు బ్యాచ్ నంబర్ గురించి కూడా విచారించాలని కోరుతున్నారు. వినియోగదారులను నమ్మించేందుకు బ్యాచ్ నంబర్లు వేశారా లేక ఫుడ్ సేప్టి విభాగం అనుమతి ప్రకారమే బ్యాచ్ నంబర్ ముద్రించారా అన్న విషయాన్ని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. మారుమూల గ్రామంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న విషయంపై అధికారులు దృష్టి సారించే అవకాశం ఉండదన్న ధీమాతో కల్తీ చేసి అమ్ముతున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.