అసాధ్యమా..? సుసాధ్యమా..?

ట్రస్మా కోర్కెల చిట్టాపై విస్మయం…

దిశ దశ, హైదరాబాద్:

ప్రైవేటు విద్యా సంస్థలపై వరాల జల్లు కురిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు చేసిన వినతి అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ఆయన సీఎం ముందు ఉంచిన కోర్కెల చిట్టా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటన్నింటిని గమనిస్తే మాత్రం ఇక ప్రైవేటు పాఠశాలల పర్యవేక్షణ అంతా కూడా సర్కారు కార్యాలయాలతో సంబంధం లేకుండానే ఉండాలన్న ఉద్దేశ్యం కనిపిస్తున్నట్టుగా ఉందన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్న ప్రభుత్వం వాటిని కూడా కమర్షియల్ గానే పరిగణిస్తోంది. కానీ ప్రైవేటు పాఠశాలలకు ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, నీటి రుసుములను కమర్షియల్ నుండి డొమెస్టిక్ కేటగిరిలోకి మార్చాలని కోరారు. నిరుపేద పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు కూడా లేని మినహాయింపు ప్రైవేటు స్కూళ్లకు ఇవ్వాలని అడగడం విస్మయం కల్గిస్తోంది.

విద్యార్థుల రక్షణ గాలికి…

ప్రేవేటు పాఠశాలల రెన్యూవల్ చేసే సమయంలో ఫైర్, ట్రాఫిక్, మునిసిపల్ తదితర విభాగాల నుండి ఎన్ఓసి అడిగే విధానానికి మినహాయింపు ఇవ్వాలని ఆ వినతి పత్రంలో ట్రస్మా అధ్యక్షుడు కోరారట. అంటే ఫైర్ సేఫ్టీ మేజర్స్, ట్రాఫిక్ అంతరాయం వంటి సమస్యలు ఉత్పన్నం అయినా ఏం పర్వాలేదు… విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ లేకున్నా మంచిదే అన్న రీతిలో ఉంది వీరి కోరిక అంటున్నారు పలువురు. ఇప్పటికే చాలా నిబంధనలు అమలు చేయకుండా రికార్డులకే పరిమతం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తుంటే ట్రస్మా ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేసిన వినతిని చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. 20 ఏళ్లుగా సాగుతున్న ప్రైవేటు విద్యా సంస్థలకు శాశ్వత రికగ్రైజేషన్ ఇవ్వాలని, వ్యాపార దృక్పథంతో ప్రైవేటు పాఠశాలలు నడవడం లేనందున ట్రేడ్ లైసెన్స్ విధానం రద్దు చేయాలని కూడా ఆ వినతిలో కోరడం విచిత్రం. శాఖా పరంగా ఉండే విధానాలకు కూడా స్వస్తి చెప్పాల్సిందేనని కూడా అభ్యర్థించిన తీరు గమనిస్తే అసలు ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖకు సంబంధం లేకుండా ఉండాలన్నట్టుగానే అనిపిస్తోందని పలువురు అంటున్నారు. ఫీజుల నియంత్రణ లేక వందల నుండి వేలకు..లక్షలకు చేరడంతో సామాన్యుడు ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపించి అప్పుల ఊబిలో కూరుకపోతున్నాడన్న ఆరోపణలు కోకొల్లలు. అయినప్పటికీ తెలంగాణ విద్యా సంస్థలు మాత్రం వ్యాపార దృక్పథంతో నడవడం లేదని పేర్కొనడం గమనార్హం. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కార్పోరేట్ లుక్ కనిపించాలన్న తాపత్రయంతో విద్యార్థుల యూనిఫాం విషయంలో ఇష్టరీతిన డిజైన్లు సెలక్ట్ చేస్తూ పేరెంట్స్ పై ఆర్థిక భారం పడే విధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు సేవారంగాన్ని మరిపిస్తున్నాయన్న రీతిలో చెప్పుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.

సీఎం కేసీఆర్ ను ట్రస్మా కోరిన గొంతెమ్మ కోర్కెలు ఇవే…

పత్రికా ప్రకటన
పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారములు

సీఎం కేసీఆర్ గారితో ట్రస్మా రాష్ట్ర నాయకుల సమావేశం విజయవంతం.
ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు.

నేడు ప్రగతిభవన్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి గౌరవ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ గారు, గౌరవ శాసనసభ్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, చొప్పదండి ఎమ్మెల్యే శ్రీ సుంకే రవిశంకర్ గారి సహకారంతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగిందని యాదగిరి శేఖర్ తెలియజేశారు.
వినతిపత్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించిన కొన్ని సమస్యలు.

  1. పాఠశాల రికగ్నిషన్ రెన్యువల్ చేయించే సమయంలో ఫైర్ , ట్రాఫిక్ మరియు మునిసిపల్ NOC లనుండి మినహాయింపు ఇవ్వాలి.
  2. వ్యాపార దృక్పథంతో పాఠశాల నడపడం లేదు కనుక ట్రేడ్ లైసెన్స్ నుండి మినహాయింపునివ్వాలి.
  3. కరోనా కాలానికి దాదాపుగా రెండు సంవత్సరాలు స్కూల్ బస్సులు రోడ్లపై తిరగనందున వాటి EIB కాలపరిమితిని పెంచాలి.
  4. ప్రాపర్టీ టాక్స్ ఎలక్ట్రిసిటీ బిల్ మరియు నీతి రుసుములను కమర్షియల్ నుండి డొమెస్టిక్ క్యాటగిరిగా మార్చాలని విన్నపము.
  5. మధ్యలో బడి మానేసిన విద్యార్థుల డ్రాప్ బాక్స్ ను ఉపయోగించే అధికారాన్ని సంబంధిత హెడ్మాస్టర్ లకు మాత్రమే ఇవ్వాలని కోరడం జరిగింది.
  6. ముఖ్యంగా 20 సంవత్సరాల పైబడి నిర్వహణలో ఉన్న పాఠశాలలకు పర్మనెంట్ రికగ్నిషన్ మంజూరు చేయాలి.
  7. ఫోటో సెకండరీ ఎడ్యుకేషన్ సైట్ లో విద్యార్థులను నమోదు చేస్తున్నందున పదవ తరగతి నామినల్ రోల్స్ ను మాన్యువల్ పద్ధతిలో ఇచ్చే పద్ధతిని ఉపసంహరించాలి.
    పై విషయాలపై వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారని త్వరలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి భావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ వినతి పత్రానికి ఇవ్వడానికి సహకరించిన వినోద్ గారికి , గంగుల కమలాకర్ గారికి , సుంకే రవిశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

విద్యానమస్తులతో
మీ
యాదగిరి శేఖర్ రావు
రాష్ట్ర అధ్యక్షులు
ట్రస్మా తెలంగాణ.

You cannot copy content of this page