దిశ దశ, న్యూఢిల్లీ:
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో ఎడిట్ కేసు విచారణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఈ మేరకు అయన తరుపు న్యాయవాది రామచంద్ర రెడ్డి ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన సమాధానంలో నాలుగు వారాల గడువు ఇవ్వాలని కోరారు. స్టార్ క్యాంపెనర్ గా ఉన్న తాను ఇప్పుడు విచారణకు వచ్చే పరిస్థితి లేదని, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నందున నాలుగు వారాల పాటు సమయం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. ఏప్రిల్ 29న ఢిల్లీలోని ఏఎఫ్ఎస్ఓ టీమ్ సీఎం రేవంత్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని కోరుతూ నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను ఎడిట్ చేశారన్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కారణంగా సీఎం రేవంత్ నాలుగు వారాల గడువు కోరగా అదే రోజున నోటీసులు అందుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన శివ కుమార్, అస్మా తస్లీమ్, సతీష్ మన్నె, నవీన్ పెట్టెంలు కూడా తమకు 15 రోజుల గడువు ఇవ్వాలని అభ్యర్థించారు.
రేవంత్ అకౌంట్ కాదు…
అయితే ఢిల్లీ పోలీసులు అమిత్ షా వీడియో ఎడిట్ చేశారని చెప్తున్న అకౌంట్ సీఎం రేవంత్ రెడ్డికి చెందిన ది కాదని అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినదని డిల్లీ పోలీసులకు ఇచ్చిన మరో నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి చెందిన అడ్వకేట్ సౌమ్య గుప్తా మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులు గుర్తించిన అకౌంట్ ను సీఎం రేవంత్ రెడ్డి మెయింటన్ చేయడం లేదని, సీఎం రేంవత్ రెడ్డి రెండు అకౌంట్లను మాత్రమే పరిశీలిస్తున్నారని వివరించారు రేవంత్ ఎనుముల, తెలంగాణ సీఎంఓ పేరిట ఎన్న ‘ఎక్స్’ అకౌంట్లను పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు వివరించామని సౌమ్య గుప్త తెలిపారు.