రంగు పడుతోంది జాగ్రత్త…. యంత్రాంగాన్ని వెంటాడుతున్న భయం…

దిశ దశ, హైదరాబాద్:

అధికారం మారగానే మొట్టమొదటి చర్యలు ప్రభుత్వ యంత్రాంగంపైనే ఉంటాయి. గత ప్రభుత్వానికి వత్తాసు పలికారన్న కారణంతో ఉన్నతాధికారి నుండి క్షేత్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరికి స్థాన చలనం జరగాల్సిందే. తమకు అనుకూలంగా ఉన్న వారినో లేక గత ప్రభుత్వంలో తటస్థంగా ఉన్న వారినో  ఆయా స్థానాల్లో భర్తి చేస్తున్నారు. మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులో ఉండే ప్రభుత్వ యంత్రాంగం అధికారం మారినప్పుడుల్లా కుర్చీలను వదులుకోవల్సి వస్తోంది. అంతే కాకుండా ఫలానా పార్టీకి చెందిన వారంటూ ఓ బ్రాండ్ కూడా వారి పేరిట క్రియేట్ అవుతోంది. అయితే ప్రభుత్వ యంత్రాంగంపై చేస్తున్న ఈ శల్య పరీక్షలకు ముందు రాజకీయ నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవల్సిన అవసరం కూడా ఉంది.

బదిలీలతోనే అంతా…

తెలంగాణాలో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారంటూ చాలాచోట్ల అధికార యంత్రాంగాన్ని మార్చేశారు. లోకసభ ఎన్నికల తరువాత కూడా ప్రభుత్వం ఆయా శాఖలను ప్రక్షాళన చేయడం ఖాయమన్న ఊహాగానలు కూడా ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న కారణంతో ఉన్నాతాధికారులే కావచ్చు…క్షేత్ర స్థాయి ఉద్యోగులే కావచ్చు వారందరని కూడా బదిలీ చేయడం పక్కా అన్నది తేలిపోయింది. అయితే ఐదేళ్ల కోసారి ప్రజాతీర్పును అనుసరించి మారే అధికార పార్టీ చెప్పు చేతల్లో లేని యంత్రాంగంపై కూడా వేటు పడుతోంది. దీంతో సర్కారులో ఉన్న పెద్దలు చెప్తున్నట్టుగా చేయక తప్పని పరిస్థితిలో కొంతమంది కొట్టుమిట్టాడుతుంటే… సర్కారే మాదేనన్న ధీమాతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న వారు మరికొందరు. అయితే ఇందులో తమదే ఇష్టా రాజ్యం అన్న ధీమాతో ఇష్టారీతిన వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకున్నంత కాలం అంతంగా చర్చకు రాలేదు… కానీ ఇటీవల కాలంలో గత సర్కారు పాలనలో తెరమీద కనిపించిన ప్రతి ఒక్కరిని బదిలీ చేస్తుండడమే సరికొత్త చర్చకు దారి తీస్తోంది.

వీరికి లేదా ..?

తెలంగాణలో కొనసాగుతున్న ఈ ఆనావాయితీని ప్రభుత్వ యంత్రాంగం విషయంలో అమలు చేస్తున్న పాలకులు తమ విషయంలో ఎందుకు పాటిండచం లేదన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగగానే కండువాలు మార్చేస్తున్న రాజకీయ నాయకులను అందలం ఎక్కిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికార దర్పాన్ని ప్రదర్శించిన నాయకులు తమ పార్టీ కండువా కప్పుకోగానే ‘‘ఫీల్ గుడ్’’ అన్నట్టుగా సీన్ మారిపోతోంది ఎందుకని..? కొలువుదీరే సర్కారు మారగానే కండువాలు మార్చుకుంటే రాజకీయ నాయకులు సచ్ఛీలురుగా మారిపోతుంటే అధికారయంత్రాంగం మాత్రం దోషులగా ఎందుకు నిలబడాల్సి వస్తోందన్నదే మిస్టరీగా మారింది. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయిన పార్టీ ఫిరాయింపుల సంస్కృతితో రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించినా బాగానే ఉంటుంది కానీ… 30 ఏళ్లకు పైగా సర్వీసులో ఉండే యంత్రాంగంపై పార్టీ ముద్రలు పడుతుండడం విచిత్రంగా మారింది. పొలిటిల్ లీడర్లు అలా వెల్లి ఇలా కండువా మార్చేసుకోగానే తమ పార్టీ బ్రాండ్ పడిపోయిందని సంతృప్తి చెందుతున్న నాయకత్వం అప్పటి వరకు తమ పార్టీ క్యాడర్ ను పెట్టిన ఇబ్బందులను కూడా మర్చిపోతోంది. ప్రత్యర్థి పార్టీని మానసికంగా కుంగదీస్తున్నామన్న సంతోషంలో అధికారంలోకి రాగానే జంప్ జిలానీలను ప్రొత్సహిస్తున్న పొలిటికల్ లీడర్లు మిగతా విషయాల్లో కూడా ఇదే విధానాన్ని అవలంభిచాలి కదా అన్నదే అందరి నోటినుండి వెలువడుతున్న మాట.

తప్పా… కాదా..?

తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు తెలంగాణాలో పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీ హయాంలో అమలయిన సంస్కృతి ఏంటీ..? ఎమ్మెల్యేల రికమండేషన్లు ఉంటేనే పోస్టింగులు ఇచ్చే విధానం అమలు చేశారు. ఈ ప్రక్రియ అంతకుముందు కూడా ఉన్నప్పటికీ నోటి మాటగా చెప్పడం, కొంతమంది నాయకులు మాత్రమే లేఖలు రాయడానికే పరిమితమై  ఉండేది. కానీ స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రికమండేషన్ లెటర్లు, ఫోన్లు చేసి అప్పటికప్పుడు పోస్టింగులను మార్చడమన్నది అత్యంత కామన్ అన్నట్టుగా మారిపోయింది. ఈ వ్యవహారాన్ని అప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా బాహాటంగానే సమర్థించుకున్న సందర్భాలూ లేకపోలేదు. దీంతో అప్పటి అధికార యంత్రాంగం అంతా కూడా ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వారి విధుల్లో ఓ భాగంగా మారిపోయింది. తెలంగాణాలో ఎలాంటి పరిస్థితులు ఉండేవంటే… ఓ అధికారి పోస్టింగ్ ఆర్డర్ అందుకున్నాడంటే సంబంధిత ఎమ్మెల్యే ఆశీస్సులు అతనికి మెండుగా ఉన్నాయని సమాజానికి అర్థమైపోయేంత. ఈ సిఫార్సు లేఖల విధానం వల్ల కొన్ని చోట్ల అయితే నెలల్లోనే అధికారులను బదిలీ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాస్తవంగా పారదర్శకమైన విధానం అమలు చేయాల్సి ఉన్నప్పటికీ పొలిటికల్ పోస్టింగులకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం రాజ్యంగ విరుద్దం. కానీ ఈ విషయాన్ని మాత్రం విస్మరించిన పాలకులు యంత్రాంగానికి పార్టీ ముద్ర వేసి బదిలీ వేటు వేస్తోంది. అప్పటి ప్రభుత్వం రికమండేషన్ల విధానానికి శ్రీకారం చుట్టడం తప్పన్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. రిటైర్ అయ్యేవరకూ సర్వీసులో ఉండే అధికార యంత్రాంగం తప్పు చేస్తే మెమోలు, ఛార్జి మెమోలు, షోకాజ్ నోటీసులు, డిసిప్లేనరీ యాక్షన్లు, కోర్టు కేసులు, క్రిమినల్ కేసులు, సస్పెన్షన్లు, ఏసీబీ దాడులు, అవసరమైతే సర్వీస్ నుండి తొలగించే విధంగా నిబంధనలు ఉన్నాయి. కానీ ఈ రూల్స్ అమలు చేయడంలో పారదర్శకత పాటించాల్సిన పాలకులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం పాలకులు చెప్పినట్టుగా నడుచుకోవడం తప్ప మరో గత్యంతరం మాత్రం లేదు. అధికారం మారినప్పుడు కండువాలు మార్చే నాయకులు మాత్రం దర్జాతనం ప్రదర్శిస్తుంటే అధికారయంత్రాంగం మాత్రం మార్పు జరిగినప్పుడల్లా మానసికవేదనకు గురవుతోంది. 

You cannot copy content of this page