మోదీకి వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా గోల్డ్ రోజెస్

ప్రేమికుల దినోత్సవం రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ ప్రత్యేక బహుమతి అందనుంది. వాలెంటైన్స్​ డేను పురస్కరించుకుని.. గుజరాత్‌కు చెందిన విద్యార్థులు బంగారు పూత పూసిన గులాబీ పూలను మోదీకి అందించనున్నారు. మోదీపై తమకు ఉన్న ప్రేమను తెలిపేందుకు ఈ పూలను ఇస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. 24 క్యారెట్ల బంగారంతో పూత పూసిన 151 గులాబీలను మోదీకి ఇవ్వనున్నారు.

కాగా, ప్రధాని మోదీ.. విద్యార్థులతో ముచ్చటించడానికి, వారితో సమయం గడిపేందుకు వీలైనప్పుడల్లా ప్రయత్నిస్తుంటారు. ప్రతి ఏడాది విద్యార్థులతో పరీక్షా పే చర్చ జరుపుతారు. చాలా సందర్భాల్లో విద్యార్థులతో మోదీ సమావేశం అవుతారు. విద్యార్థులే దేశ భవిష్యత్తుగా అభివర్ణిస్తుంటారు. ఈ నేపథ్యంలో మోదీపై అభిమానం పెంచుకున్న విద్యార్థులు.. ఈ ప్రత్యేక బహుమతిని ఇస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు, వాలెంటైన్స్ డే సందర్భంగా భర్తకు ఓ మహిళ ప్రత్యేక బహుమతి అందించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన పరిధిబెన్ అనే మహిళ.. తన భర్త దీప్‌కు 108 బంగారు గులాబీలతో హార్ట్​ షేప్‌​లో రూపొందించిన ప్రత్యేక బొకేను ఇచ్చింది. పెళ్లి తరువాత వచ్చిన మొదటి ప్రేమికుల దినోత్సవం కారణంగా ఈ ప్రత్యేక బహుమతి ఇచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దీని ధర దాదాపు ఒక లక్ష 80వేల రూపాయలు ఉంటుందని తయారీదారులు తెలిపారు.

నిజమైన గులాబీలైతే వాడిపోతాయి. ఈ బంగారు పూత పూసిన గులాబీ అస్సలు వాడిపోవు. ఎల్లకాలం మా ప్రేమకు గుర్తుగా ఉంటాయి. నా భార్య ఇచ్చిన బహుమతితో చాలా సంతోషంగా ఉన్నాను అంటూ దీప్ చెప్పాడు. ఈ ప్రేమికుల రోజున తన భర్తకు ఏదైనా కొత్తగా ఇవ్వాలనుకున్నాని.. అందుకే ఈ గులాబీ పూలు ఇచ్చానని పరిధిబెన్ తెలిపింది.

You cannot copy content of this page