దిశ దశ, హైదరాబాద్:
ఎలా తీసుకొచ్చినా ఠక్కున పట్టేస్తున్నారు… ఎక్కడ దాచి పెట్టినా చెక్ చేసి మరీ బయటపెడ్తున్నారు… కస్టమ్స్ ఆఫీసర్ల నుండి తప్పించుకోవడం ఎలా.. అని బాగా ఆలోచించిన ఓ అంతర్జాతీయ ప్రయాణీకుడు చేసిన ప్రయత్నం గురించి వింటే ఔరా అనాల్సిందే. అధికారులకు డౌట్ ఎందుకు వస్తుందనుకున్నాడో…? మహిళలకు సంబంధించిన దుస్తులనగానే వదిలేస్తారునుకున్నాడో తెలియదు కానీ ఆ ప్రయాణీకుడు చేసిన ప్రయత్నాన్ని కూడా ఇట్టే కనిపెట్టేశారు కస్టమ్స్ అధికారులు. శుక్రవారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో చోటు చేసుకున్న ఈ ఘటన కస్టమ్స్ అధికారులను కూడా ఆలోచింపజేచింది. అంతర్జాతీయంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారి ఆటలను కట్టడి చేసేందుకు కస్టమ్స్ అధికారులు కూడా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నారు. దుబాయి నుండి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణీకుని వద్ద బంగారంతో తయారు చేసిన చీరను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 461 గ్రాముల బంగారంతో తయారు చేసిన ఈ చీరను సాధారణ చీర వలెనే తీసుకొచ్చినప్పటికీ కస్టమ్స్ డేగ కళ్లకు చిక్కనే చిక్కింది. అధికారుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు సదరు ప్రయాణీకుడు చీరెకు బంగారం లిక్విడ్ స్ప్రే చేసి పట్టుకొచ్చాడు. అయితే అధికారులు ఏ మాత్రం ఎమరుపాటు లేకుండా ప్రయాణీకుడి స్కెచ్ ను భగ్నం చేసేశారు. రూ. 28 లక్షల విలువ చేసే ఈ బంగారం చీరెను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు పూర్తి వివరాలు రాబట్టే పనిలో నిమగ్నం అయ్యారు.