అప్ డేట్ కాని గూగుల్… లారీ వాలా అప్ సెట్

దిశ దశ, హుస్నాబాద్:

అప్ డేటె కాని గూగుల్ మ్యాప్ చూపించిన దారి ఏకంగా ఓ లారీని నీట మునిగేలా చేసింది. తెలంగాణలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టులోని గుడాటిపల్లి జలాశయంలోకి ఓ లారీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏ జరిగిందంటే… తమిళనాడుకు చెందిన ఓ లారి హుస్నాబాద్ కు రావల్సి ఉండగా డ్రైవర్ చేర్యాల మీదుగా బయలుదేరాడు. గమ్యం చేరుకునేందుకు లారీ డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్యలు గూగుల్ మ్యాప్ సహకారంతో ప్రయాణం ప్రారంభించారు. అర్థరాత్రి కావడంతో రోడ్లపై జన సంచారం కూడా లేకపోవడంతో వారికి గుగూల్ మ్యాప్ తప్ప మరో దిక్సూచి లేకుండా పోయింది. బుధవారం తెల్లవారు జామున నందారం స్టేజీ దాటిన తరువాత రోడ్డు ఉందని గూగుల్ చూపించడంతో చీకట్లో అలాగే లారీని నడుపుకుంటూ వెళ్లారు. మొదట కొంత నీరు రోడ్డుపై కనిపించడంతో అనుమానించినప్పటికీ వర్షం కారణంగా రోడ్డుపైకి నీరు వచ్చి చేరి ఉంటుందని భావించారు డ్రైవర్ శివ, క్లీనర్ మొండయ్య. అలాగే మరికొంత దూరం వెళ్లగానే నీరు క్రమక్రమంగా క్యాబిన్ లోకి చేరడంతో ఉలిక్కిపడ్డారు. ఇంజన్ లోకి కూడా నీరు చేరిపోవడంతో స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదని గమనించిన డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా లారీలోంచి దిగి లారీ నీటిలోకి వెల్లిన మార్గం గుండానే బయటకు చేరుకున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టులోంచి బయటకు వచ్చిన వీరు సమీపంలోని రామవరం గ్రామానికి వెళ్లి గ్రామస్థులకు విషయం చెప్పడంతో దారి తెలియక డ్రైవర్ లారీని ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి తీసుకెళ్లాడని గుర్తించారు. వెంటనే తాళ్లు కట్టి జేసీబీ సాయంతో లారీని బయటకు తీసుకొచ్చేందుకు రామవరం వాసులు శ్రమించారు. అయితే నందారం స్టేజి వద్ద రోడ్ స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించేందుకు బైపాస్ రోడ్డును చూపిస్తూ సూచిక ఏర్పాటు చేశారు. రోడ్ స్టాపర్లు వర్షానికి రోడ్డు పక్కకు పడిపోవడంతో లారీ డ్రైవర్ కు గూగుల్ మ్యాపే దిక్కయిపోయింది. దీంతో లారీ నేరుగా గుడాటిపల్లి వద్ద గౌరవెల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే రోడ్డును శాశ్వతంగా మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే గూగుల్ అప్ డేట్ కోసం కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిన అవసరం కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page