దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐలు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు.ఇందులో భాగంగా ఫిబ్రవరి 8న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను సీబీఐ అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. దీంతో ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. కాగా, ఆ గడువు నేటితో ముగినుంది.
ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు మరోసారి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని.. దీంతో బుచ్చిబాబును మరింత విచారించాల్సింది ఉందని సీబీఐ అధికారులు కోర్టుకు వివరించారు. మరో 14 రోజులు బుచ్చిబాబు కస్టడీ పొడిగించాలని కోరింది. అధికారుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బుచ్చిబాబు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా వేసింది.