చాలా మంది పాపులర్ కావాలి అని కోరుకుంటారు. ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాలో తమకు నచ్చిన వీడియోలను పోస్టు చేసి ఫేమస్ అవుతుంటారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఉద్యోగం చేసే వారు పాపులర్ కావడం కోసం యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుంటారు. ఇక మీద అలాంటి పప్పులు ఉడకవు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు యూట్యూబ్‌లో వీడియోలు చేయరాదని కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారనే కారణంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
కేరళలో పినరయి విజయన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఉద్యోగి కూడా యూట్యూబ్ ఛానెల్‌ను నడపరాదని ఆదేశాల్లో పేర్కొంది. ఎవరైనా యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తే మూసేయాలని ఆదేశించింది. యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం రాకుండా చేసేందుకు ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించడం కేరళ ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమాలు, 1960ని ఉల్లంఘించడమే అని పేర్కొంది. యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించడానికి ప్రస్తుత నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని ఉత్తర్వుల్లో పేర్కొంది. యూట్యూబ్ ఛానెల్ నిర్వహణకు అనుమతి కోరుతూ అగ్నిమాపక సిబ్బంది చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ చానళ్లు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఆ జీవోలో పేర్కొంది. ఉద్యోగులు ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తే అది ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని జీవోలో పేర్కొంది. ఉద్యోగులు ఎవరిరైనా ఇప్పటికే యూట్యూబ్ చానళ్లు ఉంటే మూసేయాలని సూచించింది.