దిశ దశ, పెద్దపల్లి:
గౌరి గుండాల జలపాతం టూరిస్టుల పాలిట గండాల జలపాతంగా మారింది. దీంతో అక్కడకు వెల్లాలంటేనే పర్యాటకులు జంకుతున్న పరిస్థితి తయారైంది. పై నుండి ఎగిసి పడుతున్న నీటిని చూసి మురిసిపోతున్న జనం మైమరిచిపోయి జలాలు జారి పడుతున్న ప్రాంతాలకు వెల్లే ప్రయత్రం చేస్తూ అందులో చిక్కుకుని ప్రాణాలు వదులుతున్నారు. దీంతో సంబరాల కేళీ కాస్తా మృత్యు కేళిగా మారిపోతోంది. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సబితం శివార్లలో ఉన్న గౌరి గుండాల జలపాతంలో మరణ మృదంగం పాడుతోంది. తరుచూ ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు రివాజుగా మారింది. ఎత్తు నుండి జారి పడుతున్న జలాలతో లోతు ఎక్కువగా ఏర్పడడంతో జలపాతం వాటర్ ఫాల్స్ వద్దకు వెల్లిన వారు మృత్యువు ఒడిలో చేరిపోతున్నారు. తాజాగా కరీంనగర్ లోని కిసాన్ నగర్ కు చెందిన కొంతమంది స్నేహితులు బుధవారం ఈ జలపాతం వద్దకు చేరుకున్నారు. మానుపాటి వెంకటేష్ ప్రసాద్ (23) జలపాతంలోకి దిగి గల్లంతు కాగా రెస్క్యూ ఆపరేషన్ చేసి మృతదేహాన్ని వెలికి తీశారు.
నో ఎంట్రీ బోర్డు పెట్టినా..
బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ జలపాతం వద్దకు వెల్లకుండా పోలీసులు, గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ టూరిస్టులు మాత్రం ఉత్సాహంగా అక్కడకు చేరుకుంటూనే ఉన్నారు. ప్రతి వర్షాకాలంలో కూడా ఈ జలపాతం వద్ద ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పర్యాటకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జలపాతం వద్దకు చేరుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా బసంత్ నగర్ పోలీసులు, పంచాయితీ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ కొంతమంది జలపాతం సమీపంలోకి వెల్తుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రధానం జలాలు కింద పడుతున్న ప్రాంతంలో లోతును అంచనా వేసే పరిస్థితులు లేకపోవడంతో చకాచకా నడుచుకుంటూ వెల్లి నీటి ప్రవాహంతో పాటు గుంతల్లో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. దీంతో అభం శుభం తెలియని అమాయకులు చనిపోతున్న తీరు ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.