దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
ఒకటి… ఒకటి… రెండు… రెండు… మూడు మూడు… వంద లోపు ర్యాంకులన్ని మావేనంటూ బాకాలు ఊదుకునే కార్పోరేట్ కాలేజీ యాజమాన్యల తీరు గురించి కళ్లారా చూశాం. ర్యాంకుల పంట మాదేనంటూ ప్రగల్భాలు పలికే ప్రైవేటు విద్యా సంస్థలనూ చూశాం. ఫలితాలు వెలువడిన తరువాత ప్రసార మాధ్యమాల్లో ప్రైవేటు కాలేజీల క్యాంపెయిన్ అంతా ఇంతా కాదు. కానీ ఇలాంటి ప్రచారం ప్రభుత్వ కాలేజీలు ఎక్కడైనా చేశాయా..? ఉచిత విద్యనందించే సర్కారు కాలేజీల్లో ఉండే లాభాలేంటో వివరించాయా..? ఈ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకున్న సందర్భాలు చాలా తక్కువే. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చే సంస్కరణల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో మాత్రం అంతగా శ్రద్ద పెట్టిన సందర్భాలు చాలా అరుదే. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ రఘునందన్ తీసుకున్న చొరవ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. నెల నెల ఠంచనుగా జీతం వస్తోంది… డ్యూటీకి వెల్లొస్తున్నాం కదా అన్న భావనతో కాకుండా తన వృత్తికి న్యాయం చేయాలనుకునే అధ్యాపకులు అతి తక్కువ మంది ఉంటారు. కానీ సిరిసిల్ల ప్రిన్సిపల్ కనకశ్రీ విజయ రఘునందన్ మాత్రం వృత్తి ధర్మానికే పెద్దపీట వేస్తుంటారు. తాను పని చేస్తున్న కాలేజీలో విద్యార్థులను తీర్చి దిద్దేందుకు ఆయన తీసుకునే చొరవ అంతా ఇంతా కాదు. సహచర లెక్చరర్లలోనూ ఇదే స్పూర్తిని నింపుతూ ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు.
హోర్డింగ్ ఏర్పాటు…
సాధారణంగా ప్రభుత్వ కాలేజీల్లో చేరండి… సర్కారు అందించే తాయిలాలు అందుకోండి అన్నట్టుగా సాగే సర్కారు కాలేజీల్లో పనిచేసే అధ్యాపక బృందాలు ఉంటాయి. ప్రైవేటు కాలేజీల ప్రచార హోరులో ప్రభుత్వ కాలేజీల అస్థిత్వమూ ప్రశ్నార్థకంగా మారింది. అయితే సిరిసిల్ల కాలేజీ ప్రిన్సిపల్ కనకశ్రీ విజయ రఘునందన్ మాత్రం సర్కారు అందించే బెనిఫిట్స్ ను కూడా వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. తన సొంత డబ్బుతో భారీ హోర్డింగ్ చేయించిన ప్రిన్సిపల్ రఘు నందన్ సిరిసిల్ల నడి బొడ్డున ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కాలేజీలో చేరే విద్యార్థులు పై చదువుల కోసం రాసే ఎంట్రన్స్ టెస్టుల్లో ర్యాంకు తెచ్చుకుంటే చాలు ప్రభుత్వం వంద శాతం ఉచిత విద్యనందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రైవేటు కాలేజీలో చదివే విద్యార్థులు పేరుగాంచిన ఇంజనీరింగ్ కాలేజీలో మెరిట్ సాధించి చదివినట్టయితే వారికి నామా మాత్రంగా ఫీజు రియంబర్స్ మెంట్ మాత్రమే ఇస్తుంది. కానీ ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యనభ్యసించేందుకు అయ్యే ఫీజు అంతా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. సిరిసిల్ల ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ రఘునందన్ ప్రత్యేకంగా ఓ హోర్డింగ్ తయారు చేయించి రాజన్న సిరిసిల్ల కేంద్రంలో ఏర్పాటు చేయించారు. ప్రైవేటు కాలేజీలో విద్య పూర్తి చేస్తే లాభం తక్కువ… అదే ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ కంప్లీట్ చేసినట్టయితే సర్కారు అందిస్తున్న సాయం చాలా ఎక్కువ అన్న విషయాన్ని విడమర్చి చెప్పేందుకు స్పెషల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరగడంతో పాటు గత వైభవాన్ని సంతరించుకునే అవకాశం ఉంటుందన్న యోచనతోనే వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది.