కన్నీరే మిగిలిందిక నేస్తం… కొత్త సీఎం వచ్చేను కదా నేస్తం… గులాభి మాయలోంచి బయటకు రాని అధికార గణం…

అధికారం వస్తుందన్న ధీమా… 

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన యథావిధిగా కొనసాగుతుందన్న భ్రమల్లో ఉన్న అధికారగణానికి మింగుడు పడని ఫలితాలు వచ్చినట్టుగా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా ఇంకా ట్రాన్స్ నుండి బయటకు రాకుండా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారన్న చర్చ సాగుతోంది. తెలంగాణలో మళ్లీ గెలిచేది తామేనన్న ధీమాతో బీఆర్ఎస్ నేతలను మించి నమ్మకంతో ఉన్న అధికార యంత్రాంగానికి తెలంగాణ ప్రజలు షాకిచ్చారు. ప్రజా తీర్పు ఇలా ఉంటుందని ఊహించని అధికార గణం అంతా కూడా నేటికీ గులాభి కండువాకు దూరం అవుతున్నామన్న ఫీలింగ్ వ్యక్తం చేస్తున్నారట. ప్రజా క్షేత్రంలో ఉంటున్న అధికార గణం కూడా పబ్లిక్ పల్స్ ను పట్టుకోలేకపోనేంత పీక్స్ చేరిపోయారా అన్న చర్చలు మొదలయ్యాయి కొన్ని శాఖల్లో. ఇంతకాలం నడిచింది మా మాటే… ఇక నడిచేది మా మంత్రమే అన్న భ్రమల్లోకి చేరిపోయిన కొంతమంది అధికారగణం ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని ఆయా విభాగాల్లో డిస్కషన్ సాగుతోంది. సర్కారు ఎవరిదైతే ఏం మనం సర్వీసులో ఉన్న వాళ్లం అన్న విషయాన్ని విస్మరించి అధికార పార్టీ నేతల చెప్పు చేతల్లోకి చేరిపోయిన చాలా విబాగాల్లోని అధికారయంత్రాంగం నేటికీ తేరుకోలేకపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇఫ్పటికీ ఓటరు తీర్పును తప్పు పడుతున్నారు కానీ… తమ తప్పిదాలు ఏంటీ..? అన్న ఆత్మ విమర్శ మాత్రం చేసుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ప్రజలు పెద్ద తప్పిదం చేశారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం మారిపోతుందన్న భాధను తట్టుకోలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రజా తీర్పు అంతా తమ బాస్ కే అనుకూలమని తమకు తామే ఊహించుకుని రాజ్యం శాశ్వతంగా తమ గుప్పిటే ఉంటుందని వేసుకున్న అంచనాలు తలకిందులు కావడం వారిని దిగమింగుకోలేని పరిస్థితికి చేరినట్టయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ కొన్ని శాఖల అధికారులు పాత పద్దతిలోనే వ్యవహరిస్తూ గులాభి పార్టీ వారికే అనుకూలంగానే ఉంటున్నారన్న ప్రచారం సాగుతోంది. కొంతమంది అధికారులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పదే పదే తెలంగాణ ప్రజలను నిందిస్తున్నారని కూడా అంటున్నారు కొందరు. అసలు సర్వీసుల్లో ఉండాల్సిన అధికార యంత్రాంగం అంతగా నొచ్చుకోవడానికి కారణాలు ఏంటీ..? ప్రభుత్వాలపై ప్రజలకు ఉన్న అభిప్రాయంతో వారు ఓట్లు వేయడం మార్పు కోరుకోవడం సహజం. రాజకీయ పార్టీల నేతృత్వంలో ఏర్పడిన సర్కారుపై ఎందుకంత మమకారం పెంచుకున్నారు..? సర్వీసు రూల్స్ కు విరుద్దంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. వాస్తవిక ప్రపంచానికి దూరమై పోయారా లేక అవాస్తవికమే నిజమన్న స్థితికి చేరుకున్నారా అన్నదే మిస్టరీగా మారిపోయింది.

ఇలాంటి వారితోనే నష్టం…

కేసీఆర్ ప్రభుత్వం ప్రజలతో మమేకం కాకుండా అధికార యంత్రాంగాన్ని అక్కున చేర్చుకుని పరిపాలన కొనసాగించిందన్న విషయం తెలంగాణలో నెలకొన్న నేటి పరిస్థితులు స్పష్టంగా కనిపించాయి. ప్రజా క్షేత్రంలో ఉండాల్సిన ప్రతినిధులు అంతరం పెంచుకుని అధికారాన్ని చెలాయించే పరిస్థితికి చేరిపోయారన్న విషయాన్ని సామాన్య ఓటరు గుర్తించిన విషయాన్ని అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లే బీఆర్ఎస్ పార్టీ తీరని నష్టాన్ని చవిచూపించింది. మన అంచనాలు ఏంటీ..? ప్రజల మనసులో ఏముందోనన్న అంశాన్ని పట్టించుకోకుండా అంతా బావుంది అన్న భ్రమలను కల్పించిన వారిలో సర్కారుకు వంత పాడిన అధికార యంత్రాంగానిదే కీలక పాత్ర. తమకు అనుకూలంగా ఉంది కదా ఇక సమాజాం అంతా కూడా బావున్నట్టే అన్న భావనతో ఉన్న అధికారయంత్రాంగం వారి ఆలోచనలకు తగ్గట్టుగానే ప్రజలు ఉన్నారని భావించారు తప్ప వారి అంతరంగం ఏంటీ అన్నది మాత్రం గుర్తించలేకపోయారు. ఇదే భావనతో మనం గెలవకపోకవడం అనేది కల సార్… ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చతకిలపడిపోతాయి సార్ అంటూ అవాస్తవిక ప్రపంచాన్ని అరచేతిలో చూపించారు కొంతమంది ఘనులు. దీంతో ప్రజాభిప్రాయాన్ని పదే పదే తెలుసుకునే సీఎం కేసీఆర్ కూడా ఇలాంటి అధికార యంత్రాంగం మాటలు నమ్మి నిండా మునిగారన్నది నిజం. ఇలాంటి భ్రమలు కల్పించే వారు చుట్టూ చేరడంతో తెలంగాణ అణువు అణువు తెలిసిన ఉద్యమనేత కేసీఆర్ వాస్తవికతను గుర్తించలేని పరిస్థితికి చేరిపోయారని స్ఫష్టం అవుతోంది. చివరకు పోలింగ్ కు కొద్ది రోజుల ముందు ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేసినా సానుకూల ఫలితం రాదన్న అబిప్రాయానికి వచ్చేసి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు.

నిజం చెప్పేవాడు ద్రోహి…

తెలంగాణ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపిన వారు… ప్రజల అభిప్రాయాన్ని వెలుగులోకి తెచ్చిన వారంతా ద్రోహులేనన్న భావనకు వచ్చేసిన సర్కారు పెద్దలు చేసిన ఘోరమైన తప్పిద పలితమే ఇది. విమర్శలు వెలుగులోకి రాకుంటే చాలు అనుకున్నారు కానీీ ప్రజల్లో మౌత్ టు మౌత్ పబ్లిసిటీ విపరీతంగా పెరిగిపోయిందన్న విషయాన్ని విస్మరించారు. సోషల్ మీడియా వల్లే ఓడిపోయామని అనుకుంటున్న సర్కారు పెద్దలు గత చరిత్రను కూడా మననం చేసుకోవల్సిన అవసరం ఏంది. 1983 ఎన్నికల్లో ఎన్టీరామారావు ప్రభంజనం వచ్చినప్పుడు ఏ ప్రసార సాధానలు ఉన్నాయి..? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించింది నిజం కాదా..? తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు సోషల్ మీడియా ఏ స్థాయిలో అక్కరకు వచ్చింది..? ఆనాడు తెలంగాణ సమాజం అంతా ఏకమైన ఉద్యమం వైపు అడుగులు వేయలేదా..? వీటన్నింటిని విస్మరించింది బీఆర్ఎస్ పార్టీ… ఆ పార్టీని భ్రమల్లోకి దింపిన ఘనులు. ప్రజలు మాత్రం స్థిరమైన నిర్ణయానికి వచ్చేశారన్న విషయాన్ని పట్టించుకోకపోవడం అసలు తప్పు.

You cannot copy content of this page