దిశ దశ, జాతీయం:
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషయంలో భారత ప్రభుత్వం అంతు చిక్కకుండా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఆయనపై పాకిస్తాన్ లో విష ప్రయోగం జరిగిందన్న విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన చికిత్స పొందుతున్న హస్పిటల్ ఫ్లోర్ లోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త పడడంతో ఆయన పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలియలేదు. అదే సమయంలో పాకిస్తాన్ ఇంటర్నెట్ సదూపాయాన్ని కూడా నిలిపివేయడంతో సోషల్ మీడియా వేదికల్లోనూ దావూద్ ఇబ్రహీం ఏమయ్యాడన్నదే మిస్టరీగా మారింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం. ముంబాయిలో దావూద్ తల్లి పేరిట ఉన్న నాలుగు ఆస్తులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం దావూద్ ఆస్థులను వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
బయటకు లాగాలనే..?
అయితే దావూద్ ఇబ్రహీం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు సమాయత్తం అయిన క్రమంలో విష ప్రయోగం కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం వెలుగులోకి రాగా… ఇదే ఆసుపత్రి నుండి ఓ అంబూలెన్స్ తో పాటు మరిన్ని వాహనాల కాన్వాయ్ ఒక ఓ మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లాయని కూడా ప్రచారం జరిగింది. చనిపోయిన వ్యక్తి దావూద్ ఇబ్రహీం అనే అన్న అనుమానాలు కూడా నిఘా వర్గాలు వ్యక్తం చేశాయి. కానీ ఆయన గురించి ఏ విషయాన్ని కూడా పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ అండర్ వరల్డ్ డాన్ కోసం భారత ప్రభుత్వం చాలా కాలంగా వేట కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాలను గమనించిన భారత ప్రభుత్వం దావూద్ విషయం బాహ్య ప్రపంచానికి తెలియడం కోసం చాలా రకాలుగా ప్రయత్నించింది. తాజాగా ఆయనకు సంబంధించిన ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించడంతో దావూద్ స్పందించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. శుక్రవారం ప్రారంభం కానున్న ఆస్తుల వేలం ప్రక్రియ ద్వారా ఇబ్రహీం రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న విషయంపైనే అందరూ దృష్టి పెట్టారు. భారత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఖచ్చితంగా రివైంజ్ తీసుకునేందుకు బయటకు వస్తారని అంచనా వేస్తున్నవారూ లేకపోలేదు. ఆయన ఉనికి బయటకు రావాలన్న లక్ష్యంతోనే సరికొత్త వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. కలుగులో ఉన్న ఎలుకలు బయటకు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల మాదిరిగానే భారత ప్రభుత్వం కూడా తనవంతు ప్రయత్నాలను మమ్మురం చేసినట్టుగా స్పష్టం అవుతోంది.