ఓ హెచ్ ఎం వినూత్న ఆలోచన…
దిశ దశ, వేములవాడ:
సకల సౌకర్యాలు… ఆధునిక సాంకేతిక విద్య… మద్యాహ్న భోజనం ఇలా ఎన్నో రకాలుగా విద్యార్థుల సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చేర్పించండి… క్వాలిఫైడ్ టీచర్లు ఉండే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్టయితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బడిబాట ద్వారా ప్రచారం చేస్తుంటారు. అయితే ఇక్కడి ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ సూర్యనారాయణ మాత్రం వైవిద్యంగా ఆలోచించారు. ప్రభుత్వ విద్యపై పేరెంట్స్ లో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకోవాలని భావించారు. ఈ సోషల్ మీడియాలో కూడా ఆధునిక సాంకేతికత ద్వారా క్యాంపెయిన్ చేస్తే ఎలా ఉంటుంది అని యోచించారు. ఇందుకు తగ్గట్టుగా ఆయన శ్రమించి ఏఐ టెక్నాలజీ ద్వారా తమ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు.
ఏఐతో ప్రచారం..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టెంల హైస్కూల్ హెడ్ మాస్టర్ సూర్యనారాయణ విద్యార్థులను ఆకట్టుకునేందుకు తనలోని ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూనే ఉంటారు. 2018లో ఇక్కడికి బదిలిపై వచ్చిన ఆయన వినూత్న ఆలోచనలో హైస్కూల్ స్ట్రెంత్ పెంచేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. ఈ కారణంగానే ఏటేటా ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఎలాగైనా సెంచరి అడ్మిషన్ల రికార్డును అందుకోవాలని భావించారు. ప్రైవేటు పాఠశాలల కన్నా మెరుగైన విద్య అందించే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మాస్టారు విద్యార్థులకు బోదించేది మ్యాథ్స్ అయినప్పటికీ సాంకేతికపై పట్టు సాధించి మరీ వైవిధ్యమైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బిటెక్ చదువుతున్న తన కూతురు ద్వారా ఏఐ టెక్నాలజి గురించి తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు సూర్య నారాయణ గుగూల్ ద్వారా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ గురించి సంపూర్ణ అవగాహన చేసుకున్నారు. చాలా రోజులుగా ఏఐ గురించి తెలుసుకోవడంలో సఫలం అయ్యారు. అనంతరం వట్టెంలా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల ఎలాంటి సౌకర్యాలు వివరిస్తారో తెలియజేస్తూ ఏఐ యాంకర్ తో చెప్పించారు. డిజిటల్ విద్యాబోధన కూడా సాగుతున్న వట్టెంల పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారైందని వివరించే ప్రయత్నం చేశారు. కంప్యూటర్లు కూడా పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం విద్యతో పాటు ఉచితంగా మద్యాహ్న భోజనం అమలు చేస్తోందని, ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్ కూడా ఇస్తోందని కూడా వివరించారు. ఏఐ యాంకర్ గా తయారు చేసిన వీడియోను వట్టెంలతో పాటు సమీపంలోని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వట్టెంల ప్రభుత్వ పాఠశాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
సౌకర్యాలు ఎన్నో: సూర్యనారాయణ హెచ్ ఎం
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఎన్నో సౌకర్యాలను అందిస్తోంది. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత విద్య ఇలా అన్ని రకాలుగా విద్యార్థుల సంక్షేమం కోసం పాటు పడుతోంది. కంప్యూటర్ విద్యను కూడా ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తీసుకరావాలని అనుకున్న క్రమంలో గత సంవత్సరం ప్రభుత్వమే ఐదు సిస్టమ్స్ ను వట్టెంలా ప్రభుత్వ హైస్కూలుకు కెటాయించింది. దీంతో సాంకేతికతపై కూడా విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించే అవకాశం లభించింది. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మేలన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్న సంకల్పంతోనే ఏఐ టెక్నాలజీని వినియోగించాను.
ఏఐ టెక్నాలజీకి సంబంధించిన వీడియో కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి