ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఉద్యోగుల ప్రాతినిథ్యాలు, కార్పోరేషన్ సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని గవర్నర్ చేసిన పది సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో టీఎస్ఆర్టీసీ కార్మికులతో పాటు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ బిల్లు-2023ని ఆమోదించారు. శాసన సభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడమే తరువాయిగా మిగిలింది. ఆర్థిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్న తెలంగాణ ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదం పొందిన తరువాత శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే గత సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించినప్పటికీ బిల్లు విషయంలో గవర్నర్ కొన్ని అంశాలను లేవనెత్తడంతో పెండింగ్ లో పడింది. తాజాగా గవర్నర్ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు మార్గం సుగమం అయింది.
గవర్నర్ కార్మికుల పక్షపాతి: బండి సంజయ్
రాష్ట్ర గవర్నర్ తమిళిసై కార్మికుల పక్షపాతి అయినందునే బిల్లులో లోపాలను ఎత్తి చూపారని బీజేపీ జాతీక ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్మికులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న కారణంగానే బిల్లులను పూర్తిగా అధ్యయనం చేసి లోపాలను ఎత్తి చూపారన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకే సీఎం కేసీఆఱ్ గవర్నర్ కు లేనిపోని దురద్దేశాలను ఆపాదిస్తూ కించపర్చేందుకు కుట్రలకు తెరలేపారని బండి సంజయ్ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల్లో లేనిపోని అపోహలు సృష్టించినా గవర్నర్ వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. ఓట్ల కోసం తూతూ మంత్రంగా బిల్లును రూపొందించి ఎన్నికల తరువాత కార్మికులను రోడ్డున పడేయాలనుకున్న కేసీఆఱ్ కుట్రను అడ్డుకుని లోపాలను సరిదిద్దేలా చేసిన గవర్నర్ తమిళి సైకి కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.