వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ …
దిశ దశ, వరంగల్:
వరంగల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం పర్యటించారు. నగరంలోని జవహర్ నగర్, నయింనగర్, భద్రకాళి చెరువు, ఎన్టీఆర్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించిన గవర్నర్ వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రత్యక్ష్యంగా పరిశీలించారు. రెడ్ క్రాస్ సొసైటి ప్రతినిధుల బృందం వరదల వల్ల గ్రేటర్ ప్రజలు ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొన్నారు, ఎంత మేర నష్టం వాటిల్లిందన్న విషయాలపై వివరించారు.
శాశ్వత చర్యలు అవసరం
ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాన్ని నియత్రించలేం కానీ వరదల వల్ల జరిగే నష్టాన్ని నివారించేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. శాశ్వత ప్రాతిపాదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రెడ్ క్రాస్ సొసైటీతో పాటు పలు ఎన్జీఓలు వరద బాధితలకు అండగా నిలుస్తున్నారని కితాబిచ్చారు. వరంగల్ నగరాన్ని తీవ్ర స్థాయిలో ముంచెత్తాయని, ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.