దిశ దశ, హైదరాబాద్:
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గానామా.. పోరు తెలంగాణమా అంటూ పాడి… ధూం ధాంలతో తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని నింపిన ప్రజా యుద్ద నౌకకు అరుదైన గౌరవం దక్కబోతోంది. విప్లవోద్యమంలో కీలక భూమిక పోషించిన గద్దర్ ను స్మరించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లాపూర్ మునిసిపాలిటీ తీర్మాణాన్ని హెచ్ఎండీఏ ఆమెదించింది. ఈ మేరకు అవసరమైన స్థలాన్ని కెటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఓ విప్లవకారుని విగ్రహం ఏర్పాటుకు అధికారికంగా అనుమతి లభించినట్టయింది. సుదీర్ఘ కాలం మావోయిజం భావజాలంతో సామ్రాజ్యవాద విధానానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాల తీరును ఎండగడుతూ నినదించారు. అయితే ఆయన ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా ప్రయత్నించినప్పటికీ ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు. చివరకు తన మనసులోని మాట బయటపెట్టిన కొంతకాలానికే అనారోగ్యం బారిన పడ్డ గద్దర్ అసువులు బాసారు. ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై పలువురు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.
ప్రజా యుద్ధ నౌక 'గద్దర్' విగ్రహ ఏర్పాటుకు అనుమతించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మాణాన్ని ఆమోదించిన @HMDA_Gov.
అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
— Telangana CMO (@TelanganaCMO) January 30, 2024