దిశ దశ, భూపాలపల్లి:
మేడిగడ్డ బ్యారేజీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ సెల్ఫ్ గోల్ అయినట్టేనా..? విచారణకు సర్కారు సై అనడానికి కారణాలు ఏంటీ..? ఎమ్మెల్సీ కవిత డిమాండ్ కు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో సరికొత్త చర్చకు దారి తీసినట్టయిందా..? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.
మేడిగడ్డ కుంగుబాటు…
ప్రతిష్టాత్మక ప్రాజెక్టంటూ పదే పదే చెప్పుకున్న కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు వెలుగులోకి వస్తే ఎవరికి నష్టం అన్నదే ఇప్పుడు అసలు చర్చకు దారి తీస్తోంది. 2018 ఎన్నికల్లో బలమైన నినాదానికి వేదికగా నిలిచిన ఈ ప్రాజెక్టు తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చిందన్నది వాస్తవం. ఎన్నికల సమయంలోనే బ్యారేజీ కుంగుబాటుకు గురి కావడం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయిన ఈ ప్రాజెక్టు విషయంలో విచారణ చేసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ర కవిత సూచించిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల విషయంలో సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తామని, అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా తీసుకెళ్తామని ప్రకటించారు. మంథని ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అతిథ్యం ఇవ్వాలని కూడా సీఎం కోరారు. దీంతో త్వరలోనే మేడిగడ్డపై విచారకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యరంగంలోకి దూకే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పిల్లర్ కుంగిపోవడంతో మెయిన్ బ్యారేజ్ నిర్మాణ లోపాలు బాహ్య ప్రపంచానికి తెలియవచ్చింది. అయితే అప్పుడు కుంగిన బ్యారేజీని బాగు చేయించే బాధ్యత తమదేనంటూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ ప్రతినిధి సురేష్ కుమార్ అప్పుడు ప్రకటించారు. తాజాగా ఇరిగేషన్ అధికారులకు ఎల్ అండ్ టి రాసిన లేఖ కూడా సంచనలంగా మారింది. ఈ బ్యారేజీని తాము బాగు చేయించలేమని లేఖ ద్వారా స్పష్టం చేయడంతో మరో సారి ఈ అంశం తెరపైకి వచ్చినట్టయింది.
విచారణ ఎలా..?
అయితే మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీలు ఒకే డిజైన్ తో నిర్మాణం జరిపారని డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం తేల్చింది. మేడిగడ్డ కుంగిపోయిన సమయంలోనే అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువన బుంగలు పడడం మరింత చర్చకు దారి తీసినట్టయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విచారణకు నడుం బిగిస్తే మాత్రం బ్యారేజీల నిర్మాణం జరిపిన ప్రాంతాలు అనువైనవా కాదా..? భూకంప జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అన్న విషయాల నుండి మొదలు పిల్లర్లు ఎంత లోతున తవ్వారు, వినియోగించిన కాంక్రీట్ వివరాలు, బేస్ నిర్మాణంలో తీసుకున్న చర్యలపై ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. కాంక్రీట్ వినియోగ సమయంలో క్యూరింగ్ వంటి అంశాలపై కూడా ఆరా తీసే అవకాశాలు లేకపోలేదు. బ్లాకుల వారిగా నిర్మించిన బ్యారేజీల కోసం గోదావరి నదిలో సాయిల్ టెస్ట్ చేశారా..? లేదా..? ఒక వేళ సాయిల్ టెస్ట్ చేసినా పిల్లర్ కుంగిపోవడానికి కారణం ఏంటీ..? అన్న అంశాలు కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర జల శక్తి విభాగం ఇచ్చిన సూచనలు ఏంటీ… నిర్మాణ సమయంలో తీసుకున్న చర్యలు ఏంటీ అన్న వివరాలు కూడా సేకరించే అవకాశం లేకపోలేదు. మొదట రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు జరిపగా ఆ తరువాత అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు నిర్మాణాలు ఎలా జరిగాయో కూడా విచారించనున్నారు. బ్యారేజ్ సైట్లను ఎంపిక చేసేందుకు నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారా లేదా అని కూడా తెలుసుకోనున్నారు. సాధారణంగా ప్రవహించే నీటి నడుమ నిర్మించే పిల్లర్ల విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా, పిల్లర్ల కింద ఇసుక ఎందుకు కొట్టుకపోయింది అన్న వివరాలు కూడా ఆరా తీయనున్నారు. అలాగే పంప్ హౌజ్ ల నిర్మాణం పాయింట్లు సరైనవేనా..? వరదల్లో ముంపునకు గురియితే ఎలా అన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా లేదా..? అన్న వివరాలను తెలుసుకోనున్నారు.
ఇంజనీర్ల మెడకేనా..?
అయితే కాళేశ్వరం విషయంలో లోతుగా అధ్యయనం చేసిన తరువాత లోపాలు వెలుగులోకి వస్తే మాత్రం ఇరిగేషన్ ఇంజనీర్ల మెడకు ఉచ్చు బిగించడం ఖాయం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నప్పటికీ సాంకేతికపరమైన అంశాల విషయంలో నిపుణులు సర్టిఫై చేయాల్సి ఉంటుందన్నది నిజం. రికార్డుల్లో ఇరిగేషన్ ఇంజనీర్లు సర్టిఫై చేస్తారు కానీ ప్రభుత్వం నడిపించే వారికి ఏ మాత్రం బాధ్యత ఉండదు. దిశా నిర్దేశం చేసేందుకు ప్రజా ప్రతినిధులుగా హక్కులు ఉన్నప్పటికీ బాధ్యుతలు మాత్రం అధికారయంత్రాంగంపైనే ఉంటాయి. కాళేశ్వరం విషయంలో ఇంజనీర్లు చేసిన తప్పిదాలు వెలుగులోకి వచ్చినట్టయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోనే అవకాశాలే మెండుగా ఉంటాయి. అలాగే రిటైర్డ్ ఇంజనీర్లను నియమించుకోవడం వంటి అంశాలతో పాటు ఇంజనీర్లు ప్రభుత్వంలోని ప్రముఖులు తమపై ఒత్తిడి చేశారని వాంగ్మూలం ఇచ్చినట్టయితే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కూడా ఈ వ్యవహారంలో ఇరుక్కోక తప్పదు. ఇంతకాలం కాళేశ్వరం అసెట్ గా బావించిన తెలంగాణ సమాజం ఇప్పుడు కాళేశ్వరం గుది బండగా మారిందన్న అభిప్రాయానికి వస్తోంది. దీంతో కాళేశ్వరం చుట్టే రాష్ట్ర రాజకీయాలు ముడిపడినట్టుగా మారిపోయింది.