దిశ దశ, కరీంనగర్:
ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిందా..? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుకుంటామని భావించిన వారికి షాక్ తగులుతోందా..? అంటే అవుననే అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా నుండే ఇద్దరు స్కూల్ యాజమానులు పోటీ చేస్తుంటే మెదక్ ఉమ్మడి జిల్లా నుండి మరో నేత కూడా పోటీ చేసేందుకు కార్యరంగంలోకి దిగారు. దీంతో ట్రస్మా ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చే అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
ఏకగ్రీవ మద్దతు…
వచ్చే ఏడాది కరీంనగర్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియకు కూడా ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఈ నేఫథ్యంలో మొదట ట్రస్మా తరుపున కరీంనగర్ కు చెందిన యాదగిరి శేఖర్ రావుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రతినిధులు ఓ సమావేశంలో ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల చేతిలో పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నాయని యాదగిరి శేఖర్ రావు గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని భావించారంతా. అయితే అనూహ్యంగా రోజుకో కొత్త పేరు వెలుగులోకి వస్తుండడంతో ట్రస్మా చీఫ్ అడ్వయిజర్ గా వ్యవహరిస్తున్న శేఖర్ రావుకు అడ్డంకులు మొదలయ్యాయి. కరీంనగర్ చెందిన మరో ప్రైవేటు పాఠశాల యజమాని ముస్తాక్ అలీ కూడా పోటీలో ఉండడంతో సొంతింటి నుండే ఆయనకు వ్యతిరేకత మొదలైంది. ముస్తాక్ అలీ తాను ట్రస్మా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాని ప్రకటించిన నేపథ్యంలో సంఘంలో చర్చ జరగింది. గతంలో ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించారని, ఇప్పుడు ఆయనకు సంఘంలో కీలక బాధ్యతలు లేవన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే ఆయన మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల నుండి మాత్రం తప్పుకోనని కుండ బద్దలు కొట్టి ప్రచారం కొనసాగిస్తున్నారు. దీంతో శేఖర్ రావుకు సొంతింటి నుండే వ్యతిరేకత మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
మెదక్ జిల్లా నుండి…
మరో వైపున ట్రస్మాలో కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పటోళ్ల రాఘవేందర్ రెడ్డి కూడా పోటీలో ఉంటున్నట్టు ప్రకటించారు. పటాన్ చెరు సింగిల్ విండో ఛైర్మన్ గా కూడా పని చేస్తున్న ఆయన తనకున్న వ్యక్తిగత పరిచయాలతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మెదక్ ఉమ్మడి జిల్లాతో పాటు నిజామాబాద్, ఆధిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుండి కూడా తనకు మద్దతు లభిస్తుందన్న వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారు. రాఘవేందర్ రెడ్డి. సీనియర్ నేత కూడా అయిన ఆయనకు అనుకూలంగా కేవలం ట్రస్మా ప్రతినిధులే కాకుండా ఇతర వర్గాలు కూడా వెన్నుదన్నుగా నిలుస్తాయని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
సొంతింటి నుండే…
ట్రస్మాలో కీలకంగా వ్యవహరిస్తున్న వారు పోటీకి దిగడంతో సంఘం ప్రతినిధుల్లో అయోమయం నెలకొంది. పట్టమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారు కావడంతో ఎవరిని బుజ్జగించాలో… పోటీ నుండి ఎవరిని తప్పించాలి అన్న విషయంలో మల్లగుల్లాలు పడాల్సి వస్తున్నటుగా ఉంది. ఎవరికి మద్దతు ప్రకటించినా మరో నేత కినుక వహిస్తారని, వీరిని మెప్పించి ఒప్పించడం ఎలా అన్న విషయంలో యూనియన్ కీలక నేతల్లో తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్దతు ఇచ్చే విషయంలో తటస్థ వైఖరి అవలంభిస్తే మాత్రం ట్రస్మా ఓట్లు చీలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఖచ్చితంగా పోటీ చేయాలనుకున్న ట్రస్మా నేతలు ఓటర్లను అభ్యర్థించడం కంటే ముందు సొంత సంఘం నుండి ఎదురవుతున్న పోటీలో గెలుపొందాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ట్రస్మా నుండి పోటీ చేసే వారి సంఖ్య పెరుగుతుండడం ఇతర అభ్యర్థులకు కూడా లాభించే అవకాశం లేకపోలేదు.