దిశ దశ, కరీంనగర్:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆశావాహులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. విద్యా సంస్థల అధినేతలు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. వారి లక్ష్యాన్ని చేరుకునేందుకు చివరకు మైనర్ పిల్లలను ఎన్నికల ప్రచార పర్వానికి వాడుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.
తమ చేతిలో ఉన్నారని…
ప్రాథమిక విద్య నుండి పీజీ వరకు ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 30 నుండి ఓటరు నమోదు కోసం ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల పేర్లను ఓటరు జాబితాలో చేర్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు ఆశావాహులు. ప్రత్యేకంగా పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 100 మంది ఎన్ రోల్ చేయాలన్న కండిషన్ పెట్టడమే ఓ ఎత్తైతే ఏకంగా తమ విద్యా సంస్థల్లో పని చేస్తున్న మైనర్ల ద్వారా కూడా ఓటరు నమోదు కోసం ఫారాలను పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక్కో స్టూడెంట్ కు ముగ్గురి చొప్పన ఓటర్లుగా నమోదు చేయాంచాలని టార్గెట్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మూడు ఎన్ రోల్ మెంట్ ఫారాలను అప్పగించి మీ ఇంట్లో వారు కాకుంటే ఇరుగు పొరుగు వారైనా సరే, లేదంటే బంధువులు అయినా సరే ఖచ్చితంగా ఒక్కో విద్యార్థి తరుపున ముగ్గురు ఓటర్లను నమోదు చేయించాలన్న కండిషన్ విధించినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో ఔత్సాహం చూపిస్తున్న ఒకరిద్దరు అభ్యర్థులు చిన్న పిల్లలను కూడా ఎన్నికల ఊబిలోకి దింపుతుండడం ఏంటన్న చర్చ సాగుతోంది. సాధారణ ఎన్నికల్లో అయితే మైనర్లను ప్రచారానికి వాడుకున్నట్టయితే ఎన్నికల కమిషన్ సదరు పార్టీలు, అభ్యర్థులపై కేసులు నమోదు చేయనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుట్టు చప్పుడు కాకుండా తమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు టార్గెట్ విధిస్తున్న తీరుపై కమిషన్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న అంశంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.
పీజులిచ్చి మరీ సేవా..?
విద్యా సంస్థల్లో అడిగినంత ఫీజులు చెల్లించి యాజమాన్యలు చెప్పినట్టుగా నడుచుకోవడమే కాకుండా ఎన్నికల ప్రక్రియలో కూడా చిన్నారులచే అదనపు సేవలు చేయించుకుంటున్న తీరే విద్యావంతులను విస్మయపరుస్తోంది. మైనర్ విద్యార్థులకు చదువులు చెప్పడంతోనే సరిపెట్టకుండా వారి రాజకీయ అవసరాల కోసం వినియోగిస్తున్న తీరు అందరిని ఆశ్యర్యపరుస్తోంది. విద్యాసంస్థల అధిపతులు పట్టభద్రులను ఆకట్టుకునేందుకు తమ సేవా కార్యక్రమాల గురించి విస్తృతంగా చెప్పుకోవల్సింది పోయి, తామే ఓటర్ల నమోదు ప్రక్రియను కొనసాగిస్తే వారంతా తమకే ఓట్లేస్తారన్న ఆలోచనతో కమిషన్ బాధ్యతలను కూడా తమ భుజాలపై వేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.