పెద్దపల్లిలో ఇష్టారాజ్యం
దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లాలో కొనుగోలు కేంద్రాల నుండి బయలుదేరిన ధాన్యం లారీలు దారి మల్లుతున్నాయి. నిఘా వైఫల్యమా లేక నిర్లక్ష్యమా అంతుచిక్కడం లేదు కానీ దర్జాగా ధాన్యం మాత్రం సంబంధం లేని మిల్లుల్లోకి చేరిపోతున్నాయి. తాజాగా జిల్లాలోని మంథని సమీపంలోని కూచిరాజ్ పల్లి మిల్లులో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం సంచలనగా మారింది. శనివారం ఉదయం సుల్తనాబాద్ మిల్లుకు చేరాల్సిన ధాన్యం లారీలు కూచిరాజ్ పల్లిలోని మరో మిల్లుకు చేరడం కలకలం సృష్టించింది. ఈ విషయంపై స్థానికులు పెద్దపల్లి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో లారీలను హుటాహుటిన తప్పించారు. సీఎంఆర్ ద్వారా ధాన్యాన్ని సేకరించిన సదరు రైసు మిల్లును అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ ఈ మిల్లుకు ధాన్యం లారీలు వెల్లడం వెనక కారణం ఏంటన్నది అంతుచిక్కకుండాపోయింది. మంథని పట్టణంలోని ఓ కొనుగోలు కేంద్రం నుండి ట్రక్ షీట్స్ తీసుకుని బయలుదేరిన లారీలను సుల్తానాబాద్ మిల్లుకు తరలించాల్సి ఉండగా కూచిరాజ్ పల్లిలోని మరో మిల్లులో ధాన్యం దింపేందుకు వెళ్లాయని, దీంతో అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో లారీలను అక్కడి నుండి పంపించేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ అధికారులకు ఫిర్యాదు చేసి మిల్లులోని సీసీ ఫుటేజీ సేకరించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బ్లాక్ లిస్టులో ఉన్నా..
అయితే కూచిరాజ్ పల్లిలోని సదరు మిల్లును సివిల్ సప్లై అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. గతంలో సీఎంఆర్ ప్రకారం ధాన్యం డీఎస్ఓ విభాగానికి తిరిగి అప్పగించడకపోవడంతో సదరు మిల్లుపై చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో కూడా సదరు మిల్లులో అక్రమాలు జరిగినట్టుగా తేలినట్టు సమాచారం. అయితే ఈ మిల్లులోకి శనివారం ఉదయం సుల్లానాబాద్ కు వెల్లాల్సిన ధాన్యం లారీలు ఎందుకు వెల్లాయన్నదే అంతు చిక్కకుండా పోయింది. ఒక వేళ లారీని వేరే చోటకు తరలించాలన్నా అధికారుల అనుమతి తీసుకోవల్సిన అవసరం ఉంటుంది. అయితే సివిల్ సప్లై అధికారులు ట్రక్ షీట్ లో పేర్కొన్న విధంగా వేరే మిల్లుకు బదలాయించాలంటే జిల్లా స్థాయి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ అధికారులు ఈ లారీలను వేరే మిల్లుకు తరలించాలని సూచించినట్టయితే సివిల్ సప్లై విభాగం బ్లాక్ లిస్టులో పెట్టిన మిల్లుకు ఎందుకు పంపిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే బ్లాక్ లిస్టులో ఉన్న సదరు మిల్లులో ధాన్యం నిల్వలు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మిల్లు యజమాని సొంతగా ధాన్యాన్ని సేకరించినట్టయితే ఇందుకు సంబంధించిన లావాదేవీలను పరిశీలించి నిజాలను నిగ్గు తేల్చాలని, సన్న రకాలు అయితే అవి ఎప్పుడు కొనుగోలు చేశారో కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రబీ సీజన్ కావడంతో ఇప్పుడు పండించే ధాన్యం దొడ్డు రకాలవే ఉంటాయని, అలాంటప్పుడు సన్నాలు ఆ మిల్లు యాజమాన్యం ఎలా సేకరించిందన్నది అంతు చిక్కకుండా పోతోంది. శనివారం వెలుగులోకి వచ్చిన రెండు లారీలతోనే సరిపెట్టారా లేక ఇటీవలి రోజుల్లో ధాన్యం అక్కడ అన్ లోడ్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజులు వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో మిల్లులో స్టోర్ చేసి ఉన్న ధాన్యాన్ని కూడా పరిశీలించాలని, అలాగే ట్రక్ షీట్ల వారిగా జిల్లాలోని అన్ని మిల్లులకు పంపించిన ధాన్యం స్టాక్ వివరాలను క్రాస్ చేయాలని అప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. అంతేకాకుండా నిపుణులను కూడా రంగంలోకి దింపితే మంథని సమీపంలోని మిల్లులో ఉన్న నిల్వలు పాతవా కొత్తవా అన్నది కూడా తేలుతుందని అంటున్నారు. అంతేకాకుండా మిల్లరు ఏ రైతు వద్ద ధాన్యం సేకరించాడో కూడా రికార్డులను పరిశీలించినట్టయితే సదరు రైతు అమ్మకాలు జరిపాడా లేదా అన్న విషయంతో పాటు, వ్యవసాయ అదికారుల దృవీకరణ పత్రాలు, ఆ రైతు కొనుగోలు కేంద్రాలకు అమ్మిన ధాన్యం ఎంత..? మిల్లుకు విక్రయించింది ఎంతా అన్న వివరాలపై సమగ్రంగా దర్యాప్తు చేసినట్టయితే లోగుట్టు బట్టబయలవుతుందని అంటున్నారు స్థానికులు. ధాన్యం రవాణా కాంట్రాక్టర్లపై కూడా ఈ విషయంలో అనుమానాలకు తావిస్తోంది. సుల్తానాబాద్ కు పంపించాల్సిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులోకి రవాణా చేసినట్టయితే తమకు డిజీల్ ఖర్చు తగ్గడంతో పాటు బిల్లు మాత్రం మంథని నుండి సుల్తానాబాద్ వరకు సివిల్ సప్లై అధికారులు చెల్లిస్తారన్న ఆలోచనతోనే ఈ దుస్సాహాసానికి ఒడిగట్టి ఉంటారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
గత అనుభవాలు…
పెద్దపల్లి జిల్లా సివిల్ సప్లై అదికారులు అప్పుడే గత అనుభవాలను మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది. రేషన్ బియ్యం దారి మల్లి మిల్లులకు చేరుతున్న విషయం తేటతెల్లం కావడంతో పలువురిపై చర్యలు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ సీజన్ లో సేకరించిన ధాన్యం తరలింపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రంగంలోకి బృందాలు…
అయితే మంథనిలోని కూచిరాజ్ పల్లి మిల్లు విషయం వెలుగులోకి రాగానే జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీయడం ఆరంభించారు. సివిల్ సప్లై విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు సుల్తనాబాద్ సమీపంలోని మిల్లుకు వచ్చిన ధాన్యం లెక్కలను తీసే పనిలో నిమగ్నం అయ్యారు. పూర్తి వివరాలు సేకరించిన తరువాత చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సుల్తనాబాద్ మిల్లుతో పాటు కూచిరాజ్ పల్లి మిల్లు కు చేరిన ధాన్యం గురించి కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తే ఇతర మిల్లులకు వెల్లే ధాన్యం ఏమైన ఇక్కడకు చేరిందా అన్న విషయంపై కూడా స్పష్టత వస్తుందని అంటున్నారు స్థానికులు.