దిశ దశ, కరీంనగర్:
ఆదివారం హలిడే రోజే అయినా కరీంనగర్ రోడ్లన్ని సందడి సందడిగా మారాయి. సెలవు దినం కావడంతో నగర వాసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వకుండా మారథాన్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరానికి చెందిన వేలాది మంది మారథాన్ లో ఉల్లాసంగా గడిపారు. తీగల వంతెన నుండి ప్రారంభమైన ఈ మారథాన్ నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా సాగింది. ఈ మారథాన్ లో 3, 5, 10, 21.5 కిలోమీటర్ల మేర నిర్వహించారు. నిర్వహాకులు గత నెలలోనే ఆన్ లైన్ లో మారథాన్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపే వారు తమ వివరాలను అప్ లోడ్ చేయాలని సూచించడంతో నగరానికి చెందిన వివిధ రంగాల ప్రొఫెషనల్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కరీంనగర్ రోడ్లన్ని కూడా సరికొత్త శోభను సంతరించుకుంది.
పనిష్మెంట్ TO ప్రమోషన్: మంత్రి గంగుల కమలాకర్
ఒకప్పుడు కరీంనగర్ అంటే పనిష్మెంట్ ఏరియాగా భావించే పరిస్థితి ఉండేదని, ఈ పేరు తొలగించాలన్న సంకల్పంతో అభివృద్ది చేపడుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ తీగల వంతెన వద్ద మారథాన్ ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచంలోనే అద్భుత నగరాల్లో కరీంనగర్ ఒకటిగా తీర్చిదిద్దాలన్న తపనతో ముందుకు సాగుతున్నామన్నారు. మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతెన, ఆధ్మాత్మిక వంతెన, మెడికల్ కాలేజీ ఇలా అన్ని రంగాల్లో కరీంనగర్ అభివృద్ది పథం వైపు ముందుకు సాగుతుందన్నారు. ఒకప్పుడు గుంతలమయమై, చెత్తా చెదారం, డ్రైనేజీ నీటి ప్రవాహంతో కరీంనగర్ రోడ్లు కనిపించేవన్నారు. అయితే గత పదేళ్లలో కరీంనగర్ సిటీ రూపురేఖలనే మార్చేశామన్నారు. రానున్న ఏడాదిలో పూర్తి కానున్న మానేరు రివర్ ఫ్రంట్ తో కరీంనగరం ప్రపంచ పర్యాటక రంగంగా కూడా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు, కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావులు కూడా పాల్గొన్నారు.