దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రిటైర్డ్ ఎంపీడీఓ మృత్యువాత పడ్డారు. కశ్మీర్ గడ్డలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించిందన్న సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ స్టేషన్ యంత్రాంగం రంగలోకి దిగింది. ఈ ఘటనలో రిటైర్డ్ ఎంపీడీఓ అన్నమనేని మధుసూన్ (82) మృత్యువాత పడగా, ఆయన భార్య సులోచన (78), కొడుకు వెంకటేశ్వర్ (40)లు తీవ్ర గాయాల పాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే కరీంనగర్ టూటన్ సీఐ టి లక్ష్మీ బాబు నేతృత్వంలో పోలీసు బృందం కూడా పరిశీలించింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్న వివరాలు తెలుసుకునేందుకు క్లూస్ టీం కూడా పంపించారు. ఘటనా స్థలంలో ఓ బాటిలో కిరోసిన్ ఉన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆత్మహత్య చేసుకని ఉంటాడని భావిస్తున్నారు. మధుసూధన్ మంటల్లో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో సులోచన అరవడంతో ఆయన కొడుకు వెంకటేశ్వర్ బిల్డింగ్ పై నుండి కిందకు వచ్చి తండ్రిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే మృతుడు మధుసూధన్ కు అతని మనవనికి మధ్య అనుభందం చాలా ఎక్కువగా ఉందని, రెండు రోజుల క్రితం మనవడు అమ్మమ్మ ఇంటికి వెల్లడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు మాత్రం సమగ్ర విచారణ జరిపిన తరువాతే వివరించగలుగుతామని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు వివరించారు.