దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ పంచాయితీ ముదిరి పోయినట్టుగా ఉంది. సభ్యులకు, అసోసియేషన్ ప్రతినిధులకు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అసోసియేషన్ అధ్యక్షునిగా బాధ్యత వహిస్తున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ బావ శంకర్ తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీకి వ్యతిరేకంగా ఫ్యాక్టరీ యజమానులు వార్ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయకుండా కమిటీ వ్యవహరిస్తోందని నిరసనలు తెలిపిన అసోసియేషన్ సభ్యులు లీగల్ ఫైట్ చేయడం ఆరంభించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా సొసైటీ రిజిస్ట్రార్ కు లీగల్ నోటీసులు పంపించారు. కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ను కరీంనగర్ సొసైటీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 302/2017 నంబర్ పై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లీగల్ నోటీసులో వివరించారు. ఈ అసోసియేషన ప్రతి రెండేళ్ల కోసం జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు లావాదేవీలను సభ్యులకు చూపించాల్సి ఉంటుందని నిభందనలు చెప్తున్నప్పటికీ ఆ మేరకు నడుచుకోవడం లేదని అందులో పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటయినప్పటి నుండి కూడా ఇదే పరిస్థితి ఉందని, రిజిస్ట్రేషన్ అయిన తరువాత కూడా కమిటీ ఏకగ్రీవం అయిందంటూ రికార్డుల్లో పేర్కొన్నారు కానీ తమను మోసం చేశారని, ఆరోపించారు. అలాగే సభ్యులతో సంబంధం లేకుండా బైలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఇందుకు అనుమతించవద్దని కోరారు. అంతేకాకుండా అసోసియేషన్ భవనానికి తాళలు వేసి సంఘ సభ్యులను కూడా ఎంట్రీ కానివ్వకుండా బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ మేరకు అడ్వకేట్ జె వేణుగోపాల్ రావు ద్వారా జిల్లా సొసైటీ రిజిస్ట్రార్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఇప్పటి వరకు అసోసియేషన్ సభ్యులు కమిటీ బాధ్యులకు ఫోన్ ద్వారా, వాట్సప్ ద్వారా టచ్ లోకి వెల్లే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు అసోసియేషన్ సభ్యులు ఆఫీసు బిల్డింగుకు నోటీసులు అంటించడం, ఆ తరువాత నిరసన దీక్షకు కూడా పూనుకున్నారు. తాజాగా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సభ్యులు లీగల్ ఫైట్ చేసేందుకు కూడా సమాయత్తం అయినట్టుగా స్పష్టం అవుతోంది. బైలాస్ కు విరుద్దంగా వ్యవహరించవద్దంటూ సొసైటీ రిజిస్ట్రేషన్ అధికారులకు లీగల్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో… సదరు కార్యాలయం నుండి కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీకి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ అదికారుల నోటీసులకు స్పందిస్తారా లేదా అన్న విషయంపై అసోసియేషన్ సభ్యుల్లో చర్చ సాగుతోంది.