శ్మశానంలో దొంగలు… మాయం అవుతున్న పుర్రెలు…

వ్యాస కర్త : ఎడ్ల అశోక్ ఫ్రీలాన్సర్

శవాలను పీక్కుని తినే రాబంధువుల గురించి కథలు కథలుగా చదువుకున్నాం… శ్మశానంలో కీచురాళ్లు శవాలను తింటాయని విన్నాం… అర్థరాత్రి అటువైపు వెళ్లాలంటేనే గజగజ వణికిపోతుంటాం… కానీ అక్కడ కూడా దొంగల బెడద ఉందంటే నమ్ముతారా..? కాలిపోయిన శవాల తాలుకు బూడిద తప్ప అక్కడ ఏముంటుందని అనుకుంటున్నారా..? అసలు నిజం తెలిస్తే ఔరా అనక మానరు…

చనిపోయిన వారి బంధుగణం అంతా ఇళ్లకు చేరిన తర్వాత అనుకోని బంధువులు అక్కడకు చేరుకుంటున్నారు. కాలిపోయిన కాష్టంలో వెతకడం మొదలు పెడుతున్నారు. కరీంనగర్ శ్మశాన వాటికలో కాలిన శవాల నడుమ సాగుతున్న ఈ అన్వేషణ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

లక్షలాది జనం కరీంనగర్ నగరంలో మరణాలు చోటు చేసుకుంటుండడం సహజం. మృతదేహాలను మానేరు, అలకాపురి, రాంనగర్, కార్ఖానాగడ్డ, రేకుర్తి, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, అల్గునూర్, కిసాన్ నగర్ తదితర శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేస్తున్నారు. దహనం చేసిన శవాల తాలూకు పుర్రెలు ఆయా చోట్ల అదృశ్యం అవుతున్నాయి. మహిళల శవాల విషయంలో అయితే పుర్రెతో పాటు కాళ్ళూ, చేతుల అవశేషాలు కూడా మాయం అవుతున్నాయి.

ఏమై పోతున్నాయ్..?

శవాల అవశేషాలు అదృశ్యం అవుతున్న మిస్టరీ ఏమిటి? కాలి బూడిదగా మారిన తమ వారి కాష్టంలో కాలి ముద్రలు కనిపిస్తుండడంతో చనిపోయిన వారి బంధువులు కలవరపడిపోతున్నారు. శవాల పుర్రెలు కనిపించక పోవడంతో శ్మశానంలో అదృశ్య శక్తులు సంచరిస్తున్నాయా అన్న ఆందోళన వారిలో రేకెత్తుతోంది.

అసలు కథ ఇది…

అర్థరాత్రి శ్మశానాల్లో నిషాచరుల సంచారం తీవ్రంగా సాగుతోంది. కాలుతున్న శవాల నుండి కనిపించే ఎర్రని మంటలు చూడగానే వారి మొఖాలు ఎక్కువగా వెలిగిపోతుంటాయి. కాలుతున్న శవం తమ కడుపు నింపుతుందన్న ఆనందం వారిలో ఉంది. మరణించిన వారి బంధువుల కంటే ఎక్కువ ఆసక్తిని ఈ నిషాచరులు ప్రదర్శించారు. కపాల మోక్షం కలిగి… శవం కాలి బూడిదగా మారి… చల్లబడే వరకూ వారు అక్కడే కాపు కాచుకుని కూర్చుంటారు. ఇక అప్పుడు లేచి శవం తాలూకు బూడిదలో అడుగులో వేసుకుంటూ పుర్రెను, కింద ఉన్న బూడిదను చకాచక పాత్రలోకి ఎత్తుకుంటారు. చనిపోయింది మహిళ అయితే
పుర్రెతో పాటు కాళ్లు, చేతుల సమీపంలో బూడిదను కూడా భద్రపరుస్తారు. అనంతరం బూడిదను జల్లెడ పట్టడం, పుర్రెలో వెతకడం చేస్తారు. తమ అన్వేషణతో చేతికి చిక్కే అవశేషాలను తీసుకుని అక్కడి నుండి వెల్లిపోతారు.

దొరికింది ఇదే…

దహన సంస్కారం చేసినప్పుడు వారి నోట్లో బంధువులు పిసరంత బంగారం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని సామాజిక వర్గాల వారు తమ కుటుంబంలోని మహిళ చనిపోతే ఆమె శరీరంపై ఉన్న ఆభరణాలను అలాగే ఉంచి అంతిమ సంస్కారం కలిగి ఉంటారు. మగవాళ్ల నోట్లో పెట్టె బంగారం, మహిళా మృతదేహాలపై ఉండే ఆభరణాల తాలుకు అవశేషాల కోసం వీరు శ్మశానంలో తచ్చాడుతూ ఉంటారు. శ్మశానంలో దొరికిన బంగారాన్ని జమ చేసి అమ్ముకుని పొట్ట పోసుకుంటున్నాయి కొన్ని కుటుంబాలు. వైకుంఠ ధామాలపై ఆధారపడి జీవిస్తున్నాయి.

————————————————-

ఎడ్ల అశోక్ 

You cannot copy content of this page