భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న కాళేశ్వరం…
దిశ దశ, కాళేశ్వరం:
త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలో రుత్వికుల వేద మంత్రోచ్ఛారణల మయం అయిపోయింది. నాలుగు దశాబ్దాల తరువాత దివ్య క్షేత్రంలో కుంబాభిషేక మహోత్సం జరుగుతోంది. రెండో రోజు ఆలయంలో వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు. దేవాదాయ శాఖ నిర్వహిస్తున్న ఈ మహత్కార్యంలో తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన రుత్వికులు భాగస్వాములు అవుతుండగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. రెండో రోజైన శనివారం ప్రాత: సూక్త మంత్ర పఠనము, ప్రాత:కాల పూజలు, చండీ పారాయణము, సహస్ర ఘటాభిషేకం. చండి హోమం, ప్రదోష కాల పూజలు, హారతి, మంత్ర పుష్పం, చతుర్వేద సేవలు నిర్వహిస్తున్నారు.
శోభాయమానంగా…
40 ఏళ్ల తరువాత జరుగుతున్న శంత చండీ మహారుద్ర సహిత ఘటాభిషేక, కుంబాభిషేక మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలను కూడా సమకూర్చింది. కేవలం శివరాత్రి, పుష్కరాల సమయంలో మాత్రమే కళకళలాడే కాళేశ్వరం కుంబాభిషేకంతో శోభాయమానంగా మారిపోయింది.
రేపే ముఖ్య ఘట్టం…
మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాలలో భాగంగా అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆదివారం జరగనుంది. ఆదివారం 10.42 గంటలకు మహా కుంబాభిషేకం కార్యక్రమాం నిర్వహించనున్నారు. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి నేతృత్వంలో మహా కుంబాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆదివారం సాయంత్రంతో మూడు రోజుల మహోత్సవ ముగింపు కార్యక్రమం జరగనుంది. భక్తులు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మహా కుంబాభిషేకం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆలయ ఈఓ మహేష్ చెప్పారు. అత్యంత అరుదుగా జరిగే మహా కుంబాభిషేక ఘట్టం తిలకించేందుకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించామని తెలిపారు.