విద్యుత్ నిలిచిపోయి… రాకపోకలు ఆగిపోయి….

మళ్లీ వెంటాడిన ప్రకృతి…

తెలంగాణ వాసుల ఇక్కట్లు

దిశ దశ, కరీంనగర్:

ఓ వైపున జోరుగా కురుస్తున్న వర్షం… మరో వైపున హై స్పీడ్ గా వీస్తున్న గాలి… రోడ్లపై నడవడమూ కష్టంగా మారిన పరిస్థితులు… ప్రకృతి మరోసారి కన్నెర్రజేయడంతో తెలంగాణాలోని పలు జిల్లాల్లో సామాన్య జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రహదారులపై విరిగిపడ్డ చెట్లతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా కూడా స్తంభించిపోవడంతో తెల్లవారే వరకూ తామిలాగే జీవనం సాగించాలా అని అనుకుంటున్నారు జనం. కానీ ఓ రెండు శాఖల అధికార యంత్రాంగం సేవలు తప్ప అంతా నిర్మానుష్యంగా మారిపోయాయా రహదారులు. భయంకరమైన చీకటిలో కొట్టుమిట్టాడుతున్న ఆ ప్రాంతాల్లో వాహనాల హారన్ల మోతలు, వర్షపు చినకులు సవ్వడులు, ఈదురు గాలుల శబ్దాలు రాజ్యమేలుతున్నాయి. కానీ ప్రజల అవసరాలు… వారి కష్టాలను గుర్తించిన ట్రాన్స్ కో, పోలీసు విభాగాలు మాత్రం వీటన్నింటిని లెక్క చేయకుండా సమస్యల పరిష్కారం కోసం మైదానంలోకి దిగి సఫలీకృతం అవుతున్నారు. సోమవారం సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం, వీస్తున్న ఈదురు గాలుల ప్రభావం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కరీంనగర్ అంతా కూడా చీకటి మయం కాగా మూల కారణాలు వెతికి మీరి ట్రాన్స్ కో అధికార యంత్రాంగం రంగంలోకి దిగి విద్యుత్ పునరుద్దరణ కోసం నడుం బిగించింది. దీంతో ఒక్కో ఏరియా వారిగా విద్యుత్ కాంతులు ప్రసరిస్తున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి రహదారిలోని చల్మెడ మెడికల్ కాలేజీ వద్ద దుర్శేడ్ సబ్ స్టేషన్ మెయిన్ లైన్ పై చెట్టు విరిగిపడడంతో వెంటనే రంగంలోకి దిగిన ట్రాన్స్ కో యంత్రాంగం చెట్టును తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించింది. అలాగే నగరంలోని పలు చోట్ల కూడా ఇదే పరిస్థితి ఎదరుకాగా అవసరమైన చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దడంలో సఫలం అయింది కరీంనగర్ ట్రాన్స్ కో యంత్రాంగం. ఏది ఏమైనా తిమిరంతో సమరం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందిన వారికి ఊరటనిచ్చే విధంగా ట్రాన్స్ కో యంత్రాంగం అందించిన సేవలు అనన్య సామన్యమనే చెప్పాలి.

విరిగిపడ్డ చెట్లను తొలగించే పనిలో నిమగ్నమైన విద్యుత్ యంత్రాంగం

వరంగల్ రూట్లో ఇలా…

భారీగా వీచిన ఈదురు గాలుల ప్రభావంతో కరీంనగర్, వరంగల్ ప్రధాన రహదారిపై దాదాపు 15 చెట్లు పడిపోవడంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చిమ్మని చీకట్లు అలుముకున్నప్పటికీ పోలీసులు మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయకుంగా కార్యరంగంలోకి దూకారు. వర్షంలో తడుస్తూ, ఈదురు గాలితో వణుకుతున్నా ట్రాఫిక్ అంతరాయాన్ని పరిష్కరించాలన్న తలంపుతో మానకొండూరు సర్కిల్ పోలీసులు దాదాపు 15 చెట్లను తొలగించారు. దీంతో అప్పటి వరకు నిలిచిపోయిన వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి. వాతావరణం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ పోలీసు యంత్రాంగం తీవ్రంగా శ్రమించి రహదారినిపై ఉన్న చెట్లను తొలగించిందని కరీంనగర్ రూరల్ ఏసీపీ తాండ్ర కర్ణాకర్ రావు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో కూడా పోలీసు సిబ్బంది చేసిన సేవలు ఆదర్శంగా నిలిచాయని అభినందించారు. మరో వైపున హుజురాబాద్, జమ్మికుంట రహదారిలో… తోకలపల్లి, రాజపల్లి సమీపంలో చెట్టు విరిగి పడిపోయింది. దీంతో స్థానిక ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డిలు జేసీబీ తెప్పించి చెట్టును తొలగించేందుకు శ్రమించారు.

కరీంనగర్, వరంగల్ రహదారిలో చెట్లను తొలగించే పనిలో నిమగ్నమైన పోలీసులు

You cannot copy content of this page