ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న పెళ్లి కొడుకు…

దిశ దశ, వరంగల్:

అది వరంగల్… ఖమ్మం జాతీయ రహదారి… మరి కొద్ది సేపట్లో పెళ్లి పందింట్లో ఉండాల్సిన వరుడు ఆ రహదారి మీదుగా ప్రయాణం సాగిస్తున్నాడు. అంతలోనే ట్రాఫిక్ జాం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక పెళ్లి కొడుకే తాము వెళ్లేందుకు ట్రాఫిక్ క్లియర్ చేయాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే… వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిలోని వర్దన్నపేట మండలం ఇల్లంద సమీపంలో బుధవారం అర్థరాత్రి పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడడంతో గురువారం ఉదయం అధికారులు క్రేన్ల సాయంతో ట్యాంకర్ ను బటయకు తీసే పనిలో నిమగ్నం అయ్యారు. మూడు భారీ క్రేన్ల సాయంతో ట్యాంకర్ ను బయటకు తీస్తుండడంతో రహదారిపై పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఇదే సమయంలో వరంగల్ నుండి తొర్రూరుకు చెందిన పెళ్లి కొడుకు ప్రయాణిస్తున్న కారు కూడా ఇదే మార్గంలో నిలిచిపోయింది. దీంతో తమ వాహనం గమ్యం చేరడం ఎలా అని ఆందోళన వ్యక్తం చేసిన పెళ్లి కొడుకే క్రేన్ల వద్దకు వెల్లి తాము తొర్రూర్ కు వెల్లేందుకు మార్గం సుగమం చేయాలని కోరాడు. అయితే ట్యాంకర్ తొలగించాలంటే మరికొద్దిసేపు ఆగక తప్పదని అధికారులు చెప్పారు. మరి కాస్తా సమయం అయితే తప్ప వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించే పరిస్థితి లేదని తేల్చి చెప్పడంతో వరుడు మరో మార్గం గుండా తొర్రూరుకు బయలుదేరారు. పెళ్లి ముహుర్తానికి వధువు ఇంటికి చేరేందుకు వరుడు పడ్డ కష్టాన్ని గమనించిన వాహనదారులు అతనికి ఈ రూపంలో ఆటంకం రావడం ఏంటని చర్చించుకున్నారు.\

You cannot copy content of this page