అంతర్గత ప్రజాస్వామ్యంలో ఆ పార్టీ చరిత్రను తిరగరాసే పరిస్థితి ఏ పార్టీకి ఉండకపోవచ్చు. శాంతే మార్గంగా స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీ పేరు పెట్టుకున్న భవన్ లో నూ అ శాంతియుత వాతావరణం నెలకొనడం ఆ పార్టీకే చెల్లింది కావచ్చు. వర్గ విబేధాలు.. గ్రూపు రాజకీయాలు క్షేత్ర స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆ పార్టీలో నెలకొన్న పాలి‘ట్రిక్స్’ మరో సారి రచ్చకెక్కాయి. ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేకుంటే చర్చించాలి కానీ ఉంటే చర్చించాల్సిందేముంటుంది ఆ విధానం అందులో సహజమే కదా అంటున్న పరిస్థితి తయారైందంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి అభిప్రాయం నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరోసారి రచ్చ
ఇప్పుడు సీనియర్ బ్యాచ్ జూనియర్ బ్యాచ్ అంటూ కొత్త గ్రూపులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం పోయాలని జాతీయ నాయకత్వం చూస్తుంటే ఇక్కడ మాత్రం మా పంథా మాదేనన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నాయకులు. ఓ వైపున భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆధిపత్య పోరులో కొట్టుమిట్టాడుతున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏర్పాటు చేసిన టీపీసీసీ కార్యాలయంలో ఎప్పుడూ ఆశాంతే నెలకొంటుదన్నట్టుగా తయారైంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఎదో రకమైన విబేధాలు వెలుగులోకి వస్తుండడం జాతీయ నాయకత్వం అంతా ఇక్కడే దృష్టి సారించాల్సి వస్తుండడం గమనార్హం. నిత్యం విబేధాలతో ముందుకు సాగుతున్న ఈ నాయకులు తమ క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో కూడా అర్థం చేసుకోవల్సిన అవసరం కూడా ఉంది. తమ ప్రాంతాల్లో క్యాడర్ అంతా కలిసికట్టుగా తమ గెలుపు కోసం ప్రయత్నించాలి కానీ రాష్ట్ర నాయకత్వంలో మాత్రం తమ గ్రూపు పాలిటిక్స్ కొనసాగిస్తామన్న రీతిలో వ్యవహరించడం ఎంత వరకు కరెక్ట్..? ఈ సంకేతాలతో ఆయా నాయకులు ద్వితీయ శ్రేణిలో ఎలాంటి అభిప్రాయం నెలకొని ఉంటుందో ఆలోచించుకోవల్సిన అవసరం ఉంటుంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా కాంగ్రెస్ నేతల అడుగు జాడల్లోనే సెకండ్ క్యాడర్ కూడా నడిస్తే పార్టీని ప్రజలు అక్కున చేర్చుకుంటారా లేదా అన్నది గమనించాల్సిన అవసరం ఉంది.
కలిసికట్టా… కోవర్టా…
ఇప్పుడు టీపీసీసీలో నెలకొన్న విబేదాల్లో ప్రధానమైన పదం కోవర్ట్… నువ్వు ఆ పార్టీకి కోవర్టుగా మారావని ఒకరు అంటే నువ్వో ఫలానా పార్టీకి కోవర్టుగా మారవని మరోకరు ఆరోపించుకుంటున్న పరిస్థితి టీపీసీసీ లీడర్లలో తయారైంది. వరసగా రెండు సార్లు ఓటమి చవి చూసి మూడో సారి ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో విబేధాలు రచ్చకెక్కడం వల్ల ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నామన్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. శతాధిక వయసు కల్గిన కాంగ్రెసా పార్టీలో సీనియర్ లీడర్లుగా ఎదిగిన వారు కూడా తమలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండడం వల్ల ఎంత చులకన అవుతున్నామన్న విషయమూ వారికి అవసరం లేకుండా పోయినట్టుగా ఉంది. తమకు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో అయినా ఎదుటి వారికి దక్కుతున్న ప్రయారిటీ విషయంలో అయినా టీపీసీసీ సీనియర్ లీడర్లు బయట పడుతున్న తీరు మాత్రం విమర్శల పాలు చేస్తున్నదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పబ్లిక్ గా తమ గ్రూపు రాజకీయాలను లీక్ చేస్తుండడం వల్ల పార్టీకి తీరని నష్టమేనన్న విషయాన్ని విస్మరించచొద్దు. అంతర్గతంగా తప్పెవరిదోనన్న విషయం అటుంచితే కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ప్రజల్లో మరింత వ్యతిరేకత వ్యక్తం అయ్యే పరిస్థితి ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సమయంలో ఏకతాటిగా నడుస్తూ కలికట్టుగా ఉన్నామని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనట్టయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ పార్టీ అంటే ఏహ్య భావం నెలకొని ప్రతికూల ఫలితాలు అందుకోవల్సి ఉంటుందని మరిచిపోకూడదు.
తెలంగాణ ఇచ్చి…
స్వరాష్ట్ర కల సాకరం చరిత్ర కాంగ్రెస్ పార్టీదే. అధినేత్రి సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ ఆవిర్భావం జరిగిందన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయాన్ని ప్రజల్లో బలంగా నాటుకపోయేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేయడంపై దృష్టి పెడితే వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలను అందుకునే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సమయంలో మరోసారి తమ గ్రూపు తగాదాలకు తెరలేపడం విస్మయం కల్గిస్తోంది. రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఏర్పాటు గురించి కాంగ్రెస్ లీడర్స్ గ్రౌండ్ లెవల్లోకి తీసుకెళ్లలేక పోవడంతో క్రెడిట్ పొందలేకపోయారు. ఈ సారైన ఈ అంశాన్ని తీసుకెల్లి సఫలం అయ్యే పరిస్థితి ఉన్న అధికారానికన్నా ముందు వర్గ విబేధాలే ముఖ్యమన్న రీతిలో వ్యవహరిస్తుండడం విచిత్రం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నూతనంగా డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన నేపథ్యంలోనే ఈ వర్గ విబేధాలు తారస్థాయికి చేరుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో పార్టీ సీనియర్ నాయకులకు తెలియకుండా కొత్త వారిని డీసీసీ అధ్యక్షులుగా నియమించడంతో మరోసారి ఆ పార్టీలో పంచాయితీ మొదలైంది.