దిశ దశ, జగిత్యాల:
అసలు నేను డిగ్రీనే పూర్తి చేయలేదు… దరఖాస్తు చేసుకునేందుకే అవకాశం లేనప్పుడు ఏకంగా గ్రూప్స్ లో అర్హత ఎలా సాధిస్తానో చెప్పాలని కొండగట్టు అంజన్న డైరక్టర్ జున్న సురేందర్ డిమాండ్ చేశారు. టీఎస్పీపీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎలాంటి తప్పుచేసినా ఎంతటి శిక్ష విధించినా కొండగట్టు అంజన్న సాక్షిగా తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి సంబందించిన కొండగట్టు అంజన డైరక్టర్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు తమపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ… అవన్ని తప్పుడు విమర్శలేనని వెల్లడించారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, కొండగట్టల అంజన్న సేవలో తరిస్తున్న తమను పేపర్ లీకేజీ వ్యవహారంలో కావాలనే లాగినందుకు పరువు నష్టం దావా వేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ వ్యవహారంలో తమ పాత్ర ఉందని తెలిసినా, తాము నగదు బదిలీ చేసినట్టు నిరూపించినట్టయితే ఎలాంటి శిక్ష విధించినా సిద్దంగా ఉన్నామన్నారు. స్థానిక జడ్పీటీసీ రామ్మోహన్ రావును సైతం టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలోకి లాగడం కూడా సరికాదన్నారు. పోతారం గ్రామానికి చెందిన మంత్రి కేటీఆర్ పీఏ బండారి తిరుపతిని టార్గె చేసిన నాయకులు ఇష్టారీతిన ఆరోపణలు చేయడం మాని వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. మచ్చ లేని వ్యక్తులుగా పేరున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన అబద్దం నిజం కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో కొండగట్టు ఆలయ డైరెక్టర్లు పోచమల్ల ప్రవీణ్, కొంక నర్సయ్యలు కూడా పాల్గొన్నారు.