కాళేశ్వరం క్షేత్రంలో దాడుల సంస్కృతి…

ప్రాణ భయం ఉందంటున్న ఇరువురు

దిశ దశ, కాళేశ్వరం:

కాళేశ్వరం ఆలయాన్ని దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల నుండి టోల్ వసూలు చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంట్రీ, పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు కాంట్రాక్టర్ కు అప్పగించిన తరువాత పంచాయితీ చేతులు దులుపుకున్నట్టుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయితీ ఇచ్చిన ప్రాంతాల్లో కాకుండా ఇతర చోట్ల కౌంటర్ ఏర్పాటు చేసుకోవద్దని కండిషన్స్ ఉన్నప్పటికీ అమలు చేసే వారు లేకుండా పోయారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. తాజాగా దాడులు చేసే సంస్కృతికి కూడా శ్రీకారం చుట్టడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే కాంట్రాక్టర్ రేవెళ్లి నాగరాజు మాత్రం తనపై కక్ష పెట్టుకుని కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. టెండర్ దక్కించుకున్నానన్న అక్కసుతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు.

మోహన్ రెడ్డి ఆరోపణలు…

టోల్ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన వీడియోలు తీశారన్న కారణంతో దాడులు చేశారని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ… పంచాయితీ కెటాయించిన ప్రాంతాల్లో టోల్ వసూళ్లు చేయడం లేదని వేరే చోట కౌంటర్ ఏర్పాటు చేసి ఎంట్రీ, పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న కాళేశ్వరంలో అలజడులు రేపుతున్నారని, ఇసుక లారీల వద్ద వసూలు చేస్తుండగా గ్రామానికి చెందిన యువకులు వీడియో రికార్డింగ్ చేస్తే వారిని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే మీదుగా వెల్లే వాహనాల వద్ద కూడా రుసుం వసూలు చేస్తున్నారని, మద్యం సేవిస్తూ, ఒకరిద్దరు ప్రయాణిస్తున్న వాహనాల వారిని కూడా భయపెడుతున్నారన్నారు. జిల్లాతో్ పాటు స్థానిక నాయకులకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. కొంతమందిపై దాడులకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ సంబంధీకులు బాధితులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారన్నారు. పోలీసుల సమక్షంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మంత్రి పేరును వాడుకుంటూ ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారన్నారు. అక్రమంగా వసూలు చేసిన టోల్ డబ్బులను కాంట్రాక్టర్ల వద్ద రికవరీ చేయాలని కోరారు. పంతంగి సతీష్ అనే వ్యక్తిపై దాడి చేస్తే అతని చేయి విరిగిందని మోహన్ రెడ్డి అన్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న తనను కూడా చంపుతామని హెచ్చరించారని తనకు ప్రాణ భయం ఉందని మోహన్ రెడ్డి అన్నారు.

ఆయనతోనే ప్రాణ భయం

మరో వైపున కాంట్రాక్టర్ రేవెళ్లి నాగరాజు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త మోహన్ రెడ్డి వల్లే తనకు ప్రాణ హాని ఉందని ఆరోపించారు. తనకు టెండర్ వచ్చిందన్న విషయం తట్టుకోలేకపోయిన మోహన్ రెడ్డి, తన అనుచరులకు టెండర్ దక్కలేదన్న అక్కసుతో తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో తాను టీఆర్ఎస్ పార్టీలో కొనసాగానని అప్పుడు మోహన్ రెడ్డితో ఉన్న విబేధాలను ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని, వాటిని మనసులో పెట్టుకుని ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నాగరాజు అన్నారు. నగునూరి రమేష్, పంతంగి సతీష్ లకు డబ్బులిచ్చి గుండ్రాత్ పల్లికి పంపించి తాగించిన తరువాత వారిద్దరి మధ్య గొడవ జరిగిందన్నాడు. ఈ గొడవ వద్దకు తన అల్లుడని పిలిపించి అతనిపై దాడి చేశారని, గొడవ జరుతున్న విషయం తెలిసి తాము అక్కడికి వెల్లే సరికి పారిపోయారని నాగరాజు చెప్పారు. తళితులు అంటేనె గిట్టని మోహన్ రెడ్డి తమ సామాజిక వర్గం వారితోనే దాడి చేయించేందుకు ఉసిగొల్పుతున్నాడని నాగరాజు ఆరోపించారు. మూడు రోజుల క్రితం కూడా తన ఇంటిపైకి కొంతమందిని పంపించాడని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో తనకేమీ కాలేదని అన్నాడు. మోహన్ రెడ్డితో ప్రాణ భయం ఉన్నందున తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వదిలి వెల్లిపోతున్నామని నాగరాజు వెల్లడించారు.

You cannot copy content of this page