టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. ఆయన పాదయాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు వేలామంది మంది ప్రజలు రేవంత్ వెంట నడుస్తున్నారు. ఆయన నిర్వహించే కార్నర్ మీటింగ్‌లకు ప్రజలు భారీగా వస్తోన్నారు. దీంతో రేవంత్ పాదయాత్ర సక్సెస్ అయిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ పాదయాత్రకు మద్దతు పలుకుతోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు అగ్రనేతలు రేవంత్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇక పలువురు టీ కాంగ్రెస్ సీనియర్లు కూడా రేవంత్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. అయితే మరికొంతమంది నేతలు మాత్రం రేవంత్ పాదయాత్రకు పోటీగా పాదయాత్రలు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. దీంతో రేవంత్ వర్గంలో గుబులు రేగుతోంది.
రేవంత్‌కు పోటీగా ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వరరెడ్డి పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం భైంసా నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించగా… రేవంత్ యాంటీ టీమ్ ఈ పాదయాత్రకు మద్దతు ఇచ్చింది. రేవంత్ కు యాంటీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ ఈ యాత్రకు మద్దతు ఇచ్చారు. దీంతో ఒకే పార్టీలో రెండు పాదయాత్రలు జరుగుతుండటంతో.. టీ కాంగ్రెస్ లోని విబేధాలు మళ్లీ మొదటికే వొచ్చినట్లు అయింది.
మహేశ్వర్ రెడ్డితో ఇంచార్జ్ ఠాక్రే చర్చలు జరిపారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదని తెలుస్తోంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర దాదాపు 40 నియోజకవర్గాల్లో జరగనుంది. నిర్మల్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్, నారాయణఖేడ్ మీదుగా అందోల్, సంగారెడ్డి, పట్వాన్ చెర్వు నుంచి గాంధీ భవన్ కు చేరుకోనుంది. గాంధీ భవన్ వద్ద ముగింపు సభతో మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర ముగిసేలా రూట్ మ్యాప్ సిద్దమైంది. ఇక భట్టి విక్రమార్క కూడా త్వరలో పాదయాత్ర మొదలుపెడతారని తెలుస్తోంది.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాదయాత్రలో పలువురు సీనియర్లు కూడా పాల్గొననున్నారు. దీంతో ఒకే పార్టీలో ముగ్గురు నేతల పాదయాత్రలు టీ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోన్నాయి. రేవంత్ పాదయాత్రతో నేతల మధ్య విబేధాలు సమిసిపోతాయని అందరూ భావించారు. కానీ మళ్లీ మొదటికి రావడం కాంగ్రెస్ కార్యకర్తలను కలవరపెడుతోంది.