కీకారణ్యాల్లో తుపాకుల మోత… కర్రి గుట్టల్లో ఎదురు కాల్పులు..?

బీజాపూర్ లో ఎన్ కౌంటర్…

దిశ దశ, దండకారణ్యం:

పక్షుల కిలకిలరావాలు… వన్య ప్రాణుల అరుపులు వినిపించే అడవులు  తుపాకుల మోతలతో దద్దరిల్లిపోతున్నాయి. వరస ఎదురు కాల్పుల ఘటనలతో ప్రభావిత రాష్ట్రాల అడవులు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బలగాల జాయింట్ ఆపరేషన్లు, మావోయిస్టుల ప్రతిఘటనలతో అడవుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వరసగా రెండో రోజు కూడా ఎన్ కౌంటర్ ఘటనలు చోటు చేసుకోవడంతో కీకారణ్యాలు భయం గుప్పిట ఒదిగిపోతున్నాయి.

ఝార్కండ్ లో…

సోమవారం ఉదయం ఝర్ఖండ్ రాష్ట్రంలో బోకారా జిల్లా పర్వత ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందగా వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ ఎన్ కౌంటర్లో మరణించినట్టుగా కేంద్ర బలగాలు ప్రకటించాయి. వివేక్ దా, ఫుచ్నా, నాగో మాంఝీ మరియు కరణ్ దా అని పిలుచుకునే ఈ ముఖ్య నేతపై రూ. కోటి రివార్డు ఉన్నట్టుగా పోలీసు అధికారులు ప్రకటించారు. మాంఝీతో పాటు మరో ఏడుగురు మావోయిస్టు పార్టీ ముఖ్య నేతలు మరణించారు. ఎన్కౌంటర్ లో మరణించినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుండి ఇన్సాస్ తో పాటు పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి బలగాలు.

డీకేలో…

ఝార్ఖండ్ ఎదురు కాల్పుల ఘటన వివరాలు పూర్తిగా తెలియకముందే చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చాలా సేపు ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు బలగాలు. మరోవైపున సోమవారం బీజాపూర్ జిల్లా బేద్రే పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణం చేయిస్తున్న క్రమంలో 19 సి బెటాలియన్ కు చెందిన జవాన్ మనోజ్ పూజారి మందుపాతర పేలి మృత్యువాత పడ్డారు. మంగళవారం ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో ఎదురు కాల్పుల ఘటన జరగగా, మావోయిస్టులు మందుపాతర పేల్చినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా మాత్రం పోలీసులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

కర్రి గుట్టల వద్ద..?

తాజాగా మంగళవారం ఉదయం చత్తీస్ గడ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కర్రిగుట్టల వద్ద భారీ ఎత్తున సెర్చింగ్ కొనసాగుతోంది. వేలాది సంఖ్యలో బలగాలు కర్రిగుట్టల వైపనకు వెల్లి కూంబింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాలకు చెందిన బలగాలు జాయింట్ ఆఫరేషన్ చేస్తున్నట్టుగా సమాచారం. పోలీసు అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకత్వం ఈ గుట్టలపై షెల్టర్ తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. బలగాలకు, మావోయిస్టు పార్టీ నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు చనిపోయి ఉంటారని సమాచారం అందుతోంది. కర్రిగుట్టల వద్ద ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియరావడం లేదు.

You cannot copy content of this page