దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
ట్రైబల్ వెల్ఫైర్ గురుకుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. ఇష్టారీతిన వ్యవహిరస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సౌకర్యాలు లేకున్నా సర్దుకుపోతుంటే సమయ పాలన పాటించడం లేదంటూ పీఈటీ తమను హింసిస్తోందని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీలోని ట్రైబల్ వెల్ఫైర్ గురుకుల పాఠశాల, కాలేజీలో నెలకొన్న పరిస్థితులపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం రోడ్డుపైకి వచ్చి బైఠాయించిన విద్యార్థులు పీఈటీ జోత్స్నను సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు.
బాత్ రూమ్స్ రెండే…
580 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ గురుకులంలో కేవలం రెండు బాత్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ప్రేయర్ టైం వరకు రెఢీ అయ్యేందుకు ఆ రెండు బాత్ రూములతోనే సర్దుకపోతున్నామని అయితే, అనారోగ్య సమస్యలు ఉన్న స్టూడెంట్స్ ఆలస్యం చేస్తే ఇష్టం వచ్చినట్టుగా పీఈటీ జోత్స్న కొడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నెలసరి సమయంలో విద్యార్థులు స్నానం చేస్తుంటూ ఆలస్యం ఎందుకు అవుతుందంటూ బాత్ రూం తలుపులు నెట్టుకుంటూ లోపలకు చొరబడి వీడియోలు తీస్తు కర్రలతో కొడ్తోందని వారంటున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులు ముందుగా టీచర్లకు సమాచారం ఇచ్చినప్పటికీ పీఈటీ జోక్యం చేసుకోవడానికి కారణం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చదువుకోవాలన్న తపనతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న తమపై ఆదరణ చూపాల్సిందిపోయి క్రూరంగా వ్యవహరించడం సరికాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఈటీ జోత్స్నను సస్పెండ్ చేయకపోతే తామిక్కడి నుండి కదిలేది లేదని, ఆమె ఇదే పాఠశాలలో కొనసాగితే తమను మరింత చిత్ర హింసలకు గురి చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. తాము ఆమె తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశామన్న కోపంతో మరిన్ని రకాల ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. మహిళ టీచర్ అయి ఉండి కూడా గర్ల్స్ మన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా దురుసుగా వ్యవహరిస్తోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న ఈమె గతంలో ఇక్కడ పనిచేసిన వారిపై ఫిర్యాదులు చేయించి ఇక్కడే స్థిరపడిపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎంఈఓ రఘుపతి, పోలీసులు విద్యార్థులు ఆందోళన చేస్తున్న చోటకు వచ్చి వివరాలు సేకరించారు. జ్యోత్స పీఈటీని విధుల నుండి తప్పిస్తున్నామని అధికారులు ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళన విరమరించారు.