దిశ దశ, హుజురాబాద్:
ఆ స్టూడెంట్ జీవితం ఆగమ్య గోచరంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పాటు చదువుకునేందుకు అర్హత కోల్పోయాడు. ఉన్నత చదువులు చదివి ఏదో సాధించాలని కలలు కన్న ఆ విద్యార్థి జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టేయబడింది. ఉన్నత శిఖరాలకు చేరాలనుకున్న ఆ చిన్నారి ఉపాధి కోసం కూలీ నాలీ చేసుకుని జీవించాల్సిందే తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. ఈ స్కూళ్లో వెల్లగొట్టారు మరో స్కూలుకెళ్లి చదువుకునే పరిస్థితి కూడా లేదు అతనికి. ఇంటర్ లో ఏ గ్రూపు తీసుకోవాలి… ఎక్కడ చదవాలి అని ఆలోచించుకుంటున్న ఆ స్టూడెంట్ లైఫ్ ఇప్పుడు ముందుకెళ్లే పరిస్థితి మాత్రం లేకుండా పోయింది.
ఇక అంధకారమేనా..?
అమ్మా నాన్న కష్టపడి పెంచి పెద్ద చేయడాన్ని కళ్లారా చూసిన కమలాపూర్ వాసి హరీష్ శక్తి వంచన లేకుండా చదివి పేరెంట్స్ ను బాగా చూసుకోవాలని కలలు కనేవాడు. ఇందుకోసం తనకు అందుబాటులో ఉన్న వనరులను ఆధారం చేసుకుని 80శాతం మార్కులు సాధిస్తూ విద్యపైనే తన దృష్టిని కేంద్రీకరించాడు. అయితే అనుకోని ఘటన అతని జీవితాన్ని నాశనం చేసేసిందనే చెప్పాలి. కమలాపూర్ ఎగ్జామినేషన్ సెంటర్ లోకి చొరబడ్డ వ్యక్తి బెదిరించి మరీ పరీక్ష పేపర్ ఫోటో తీసుకుని వెళ్లాడు. హిందీ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఒక్కొక్కరిపై చర్యలు తీసుకునేందుకు ఉప క్రమించిన అధికారులు చివరకు పేపర్ బయటకు ఇచ్చాడన్న కారణంతో పదోతరగతి విద్యార్థి హరీష్ ను ఐదేళ్ల పాటు డిబార్ చేశారు. దీంతో్ హరీష్ చదువుకు దూరం కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ చదువుకున్నా సర్టిఫికెట్లు మాత్రం అతనికి ఇచ్చే అవకాశం ఉండదు. దీంతో ప్రతిఫలం అందించలేని చదువెందుకు అని అతను ఉపాధి కోసం కూలీగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు. చదువెలాగు తనకు దక్కే అవకాశం లేనందున కనీసం తల్లిదండ్రులకు అయినా భారం కాకుండా ఉండాలని భావించే అవకాశం ఉంటుంది. బాల కార్మికుని అవతారం ఎత్తి తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు తనవంతుగా ఉపాధి వెతుక్కొవడం తప్ప మరో గత్యంతరం మాత్రం అతనికి లేకుండా పోయింది.
తప్పెవరిది..?
కమలాపూర్ లో హిందీ పేపర్ లీక్ అయిన తరువాత మూలాలు వెదికిన విద్యాశాఖ అధికారులు హరీష్ ఇక విద్యను అందుకునే పరిస్థితి లేకుండా చేశారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిభందనలకు విరుద్దంగా వ్యవహరించిన వారందరిని వదిలేసి బెదిరింపులకు భయపడి పేపర్ ఇచ్చినందుకు హరీష్ ను ఐదేళ్ల పాటు డిబార్ చేయడం అనేది అత్యంత దారుణమనే చెప్పాలి. హరీష్ తన పేపర్ ఇవ్వనట్టయితే చొరబడ్డ వ్యక్తి చంపుతానని బెదింరించాడని చెప్తున్న దృష్ట్య అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం, అలాగే సెంటర్ లోకి చొరబడ్డప్పుడు నిలవురించే ప్రయత్నం చేయకపోయిన వారిని శిక్షించాల్సి ఉంటుంది కానీ అతని వద్దకు వచ్చి వార్నింగ్ ఇచ్చి మరీ పేపర్ ఫోటో తీసుకున్నారన్న విషయాన్ని పక్కన పెట్టయడం విచిత్రంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం హరీష్ విషయంలో పునరాలోచించి అతని విద్యకు బ్రేకులు పడకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.