రంగంలోకి స్పెషల్ టీమ్స్…
ఇసుక కాంట్రాక్టర్లలో గుబులు…
దిశ దశ, భూపాలపల్లి:
ఇసుక రీచులపై అధికారులు చేపట్టిన ఆపరేషన్ ఎవరిని చుట్టుకుంటుందోనన్న ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు తామేం చేసినా చెల్లిందన్న ధీమాతో వ్యవహరించిన తీరు గురించి వెలుగులోకి వస్తుందోనన్న కలవరం మొదలైంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిన గోదావరి నది ఇసుక వ్యాపారం విషయంలో ఉన్నతాధికారులు సమగ్రంగా అధ్యయనం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ కూడా రీచుల బాట పట్టగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరక్టర్లు, డిప్యూటీ డైరక్టర్లతో పాటు ఇతర అధికార యంత్రాంగం, రెవెన్యూ, పోలీసు విభాగాల అధికారులు కూడా రీచులను పర్యవేక్షిస్తున్నారు.
హద్దులు దాటారా..?
ఇసుక తవ్వకాలు ఎంత మేర జరిగాయి..? ఒక్కో రీచుల ద్వారా ఎంతమేర ఇసుక తరలిపోయి ఉంటుంది అన్న సమగ్రమైన వివరాలను సిద్దం చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన కూడా రీచులను ప్రత్యక్ష్యంగా పర్యవేక్షిస్తుండడంతో రీచుల వద్ద జరిగిన తతంగం గురించి కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ప్రధానంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలోనే ఎక్కువగా ఇసుక రీచులు ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని వివరాలను సేకరించేందుకు ప్రత్యేకంగా అధికారులను డిప్యుట్ చేసినట్టు సమాచారం. జీపీఎస్ కోఆర్డినేషన్ ద్వారా ఒక్కో రీచుకు హద్దులు నిర్ణయించారని, ఆ హద్దులు ఏమైనా అతిక్రమించారా..? అన్న విషయంపై కూడా పరిశీలన చేస్తున్న అధికారులు బృందాలు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ నుండి భద్రాద్రి జిల్లా విజయనగరం వరకు ఏర్పాటు చేసిన రీచుల్లో ఈ మేరకు వివరాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం. అయితే రీచ్ ఏర్పాటయినప్పుడే TGMDC అధికారులు హద్దులు నిర్ణయించే విధానం అమల్లో ఉంది. కానీ చాలా వరకు రీచుల్లో హద్దుల ఊసే లేకుండా పోయిందని అధికారుల సర్వేలో తేలినట్టు సమాచారం. టెక్నికల్ నిపుణులు ముందుగానే రీచు ఏర్పాటు చేసే ప్రాంతంలో ఎంత మేర ఇసుక తవ్వకాలు జరిపే అవకాశం ఉంటుందని అంచనా వేసిన తరువాత టెండర్లకు పిలుస్తుంటారని, అదే విధానంతో హద్దులు నిర్ణయించి రీచుల నిర్వాహాకులకు కొంత ప్రాంతాన్ని టీజీఎండీసీ కెటాయిస్తుందని తెలుస్తోంది. అయితే గోదావరి తీరంలోని రీచుల్లో చాలా వరకు హద్దులు దాటి ప్రవర్తించారన్న విషయం వెలుగులోకి వస్తుండడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న భయం వెంటాడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఔట్ సోర్సింగ్..?
రీచుల వద్ద TGMDC తరుపున పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకున్నప్పటికీ అక్కడ జరుగుతున్న అక్రమాల తంతు ఎందుకు వెలుగులోకి రాలేదన్న అనుమానం మైనింగ్ విభాగం అధికారుల్లో వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. నియమకం, జీతాలు ఇచ్చేది TGMDC నుండే అయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం కాంట్రాక్టర్ల కంబంధ హాస్తాల్లో ఇరుక్కపోయి వారేం చేసినా కళ్లు మూసుకుని వ్యవహరించారా అన్న విషయం అధికారుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అసలేం చేశారు..? వారికి అప్పగించిన బాధ్యతలు ఏంటీ అన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైనట్టుగా సమాచారం.
తనిఖీలు చేయలేదా..?
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్న బూచితో TGMDC అధికారులు కూడా క్షేత్ర స్థాయి తనిఖీలు చేయాలేదా..? ఇంతకాలం ఈ విభాగంలో పనిచేస్తున్న వారు ఎందుకు మిన్నకుండి పోయారు..? దీనివల్ల ప్రభుత్వానికి ఎంతమేర నష్టం వాటిల్లి ఉంటుంది అన్న విషయంపై ఆరా తీస్తున్న అధికారుల్లో వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. నిబంధనలకు పాతరేసి అక్రమాల జాతరకు తెరలేపిన తీరు క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్న అధికారుల బృందాలను విస్మయపరుస్తున్నట్టు సమాచారం. రికార్డులు మెయింటెన్ చేసే విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. అధికారుల బృందాలు మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించే నివేదికల తరువాత ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న ఆందోళన నిర్వాక్ష్కుల్లో వ్యక్తం అవుతున్నట్టుగా సమాచారం.