తాటికొండను పరేషాన్ చేస్తున్నదెవరో..?
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వచ్చిందంటే చాలు ఆ ఎమ్మెల్యే లక్ష్యంగా ఆరోపణల పర్వం కొనసాగుతుంటోంది. మహిళలను వేదింపులకు గురి చేస్తున్నాడనో లేక వారితో మాట్లాడిన ఆడియోలో లీక్ అవుతూనే ఉంటాయి. రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేల కంటే భిన్నంగా ఆయన పరిస్థితి తయారవుతుంది ఎన్నికల వేళ. ఆ ఒత్తిడి తట్టుకోలేక చివరకు ఆయన ప్రజా క్షేత్రంలోనే కన్నీటి పర్యంతం కావడం కామన్ గా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే…? ఎందుకిలా ఏడుస్తున్నారు..?
స్టేషన్ ఘనపూర్…
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యది అత్యంత విచిత్రమైన పరిస్థితే అని చెప్పాలి. ఆయన స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత తొలిసారి గెలిచినప్పుడు డిప్యూటీ సీఎంగా జాక్ పాట్ కొట్టారు రాజయ్య. అనూహ్యంగా ఆయన ఆ పదవిని వదులుకోవల్సి వచ్చింది. ఆయనను డిప్యూటీ సీఎం బాధ్యతల నుండి ఎందుకు తప్పించారన్నది ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది. ఫలనా కారణం అంటూ చిలువలు పలువలుగా చెప్పుకోవడమే తప్ప అధికారికంగా మాత్రం అధిష్టానం నేటికీ బయటపెట్టలేదు. రాజయ్య నోటి నుండి కూడా ఒక్క మాట బయటకు రాలేదు. 2018 ఎన్నికలప్పుడు ఓ మహిళతో మాట్లాడిన ఆడియో రికార్డు లీకయింది. తనను కావాలనే ట్రాప్ చేస్తున్నారని రాజయ్య గగ్గోలు పెట్టినా ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనకు టికెట్ వస్తుందా రాదా అన్న చర్చ కూడా సాగినప్పటికీ సీఎం కేసీఆర్ ఆయన వైపే మొగ్గు చూపారు. అయితే క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని తెలుసుకునేందుకు వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టుకుని జనం నడుమే తాటికొండ కన్నీటి పర్యంతం అయ్యారు. తనను కావాలనే లక్ష్యం చేసుకుని ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడిలా…
ఈసారి జానకిపురం సర్పంచ్ నవ్య ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి తనను రాజయ్య వేదింపులకు గురి చేస్తున్నారని ఆరోపణలకు దిగారు. దీంతో మళ్లీ రాజయ్య ఎపిసోడ్ తెరపైకి వచ్చినట్టయింది. ఈ క్రమంలో కొంతమంది శిఖండి పాత్ర పోషిస్తూ తనను ఇబ్బందులు పెడుతున్నారంటూ రాజయ్య వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఆయనే స్వయంగా సర్పంచ్ నవ్య ఇంటికి వెల్లి మీడియా ముందు క్షమాపణలు అభ్యర్థించారు. నవ్య మాత్రం తగ్గేదే లే అన్నరీతిలో కామెంట్ చేశారు కానీ ఆయనపై చేసిన ఆరోపణలు తప్పని మాత్రం చెప్పలేదు. అయినప్పటికీ ఈ అంశం సద్దు మణిగిపోయినట్టుగా అందరూ భావించారు. తాజాగా బుధవారం నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యర్ధులపై ఘాటుగానే విమర్శలు గుప్పించారు. కొంతమంది రండ రాజకీయాలు చేస్తున్నారంటూ మండి పడిన ఆయన సర్వేల్లో తానే గెలుస్తానని స్ఫష్టమైన రిపోర్టు వచ్చిందన్నారు. తన ఆత్మస్థైర్యం కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా భయపడే ప్రసక్తే లేదని స్ఫష్టం చేశారు. చివరి ఊపిరి ఉన్నంత వరకు తాను స్టేషన్ ఘన్ పూర్ ప్రజల మధ్యే ఉంటానని ఉద్వేగభరితంగా మాట్లాడిన రాజయ్య ఒక్కసారిగా కింద కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించడం సంచలనం కల్గించింది. ప్రతి ఎన్నికలకు ముందు రాజయ్యను లక్ష్యం చేసుకుని ఆరోపణలు రావడం ఆయన జనం మధ్య కన్నీటి పర్యంతం కావడం రివాజుగా మారినట్టు అనిపిస్తోంది.
ఇంతకీ ఎవరా శిఖండి…
ఎమ్మెల్యే రాజయ్య ఈ సారి కౌంటర్ గా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే మాత్ర ఆయనను కావాలనే ఎవరో లక్ష్యం చేసుకున్నారని స్ఫష్టం అవుతోంది. ఇటీవల శిఖండి రాజకీయాలు చేస్తున్నారంటూ మండి పడగా తాజాగా రండ రాజకీయాలు అంటూ ఆరోపణలు చేశారు. అంటే రాజయ్యకు నష్టం కల్గిస్తున్న వారెవరో ఆయనకు తెలుసని స్ఫష్టం అవుతోంది. రాజయ్య విలువ తగ్గించేందుకు ప్రజల్లో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో కూడా ఆయనకు తెలిసి ఉంటుందని అయితే ఈ పరిస్థితికి చెక్ పడుతుందా లేదా అనేది ఎన్నికలు సమీపిస్తేనే తెలుస్తుంది.