ఆ ఇలాకాలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమా..?

పొరుగు రాష్ట్రాల వారికీ తప్పని తిప్పలు…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారిందా..? వారేం చేసినా పోలీసులు చూసి చూడనట్టుగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొందా..? సాధారణ పౌరుల జన జీవనానికే సవాల్ విసురుతున్న తీరు చట్ట పరిధిలో సాగుతున్నదేనా..? జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ హత్య నేపథ్యంలో పలు రాష్ట్రాలలో సరికొత్త చర్చ మొదలైంది.

సర్కారు సానుకూలత…

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టే విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల కీకారణ్యాల్లో రోడ్లు, వంతెనల నిర్మాణం సజావుగా సాగుతుందన్న నమ్మకంతో కాంట్రాక్టరకు అండగా నిలబడాలన్న సంకేతాలు ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియాలో కాంట్రాక్టు పనులు చేసేందుకు వచ్చే కాంట్రాక్టర్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత బలగాలపై పడింది. ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణాల పనులు చకాచకా సాగేలా సహకరించాలన్న సంకేతాలను పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు ఏం చేసినా చెల్లుతుందన్న పరిస్థితికి చేరడం వల్లే జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ హత్యకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణాలోనూ…

చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా కేంద్రానికి చెందిన ముఖేష్ చంద్రాకర్ హత్యతో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ది పనుల ప్రభావం ఇరుగు పొరుగు రాష్ట్రాలపై కూడా తీవ్రంగానే పడుతున్నట్టుగా ఉంది. ఆయా ప్రాంతాల్లో నిర్మాణాల పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు మిషనరీ కావల్సి ఉన్నట్టయితే బ్రోకర్ల సహాయంతో అద్దెకు తీసుకుంటున్నారు. బ్రోకర్లు కూడా సరిహద్దు జిల్ల అయిన భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో కాంట్రాక్టు పనులు నడుస్తున్నాయని చెప్పి చత్తీస్ గడ్ అటవీ ప్రాంతాలకు మిషనరీని తరలిస్తున్నారు. అక్కడి పరిస్థితులు గమనించిన డ్రైవర్లు మిషనరీని అక్కడే వదిలేసి తప్పించుకుని స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీంతో మిషనరీ యజమానులు తమ వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు వెల్లినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాంట్రాక్టర్లు మిషనరీని అప్పగించకుండా సమీపంలోని పోలీసులకు చెప్తామన్న హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పనులు జరుగుతున్న దృష్ట్యా పోలీసులు కూడా మిషనరీల యజమానులను కట్టడి చేస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన మిషనరీని తిరిగి తెచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. చివరకు కాంట్రాక్టర్లు చెప్పినంత డబ్బు చెల్లించి మిషనరీ తీసుకుని స్వస్థలాలకు వస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పనులు సకాలంలో పూర్తి చేయించుకునేందుకు పోలీసుల అండదండల కారణంగానే కాంట్రాక్టర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కాంట్రాక్టర్ పై ఆరోపణలు…

తాజాగా హత్యకు గురైన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ విషయంలోనూ కాంట్రాక్టర్ ప్రమేయం ఉన్నట్టుగా బీజాపూర్ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. రూ. 56 కోట్ల అంచనాలతో మంజూరైన ఓ రోడ్డు ఎస్టిమేట్లను రివైజ్ చేసి 120 కోట్లకు పెంచారని… అయినప్పటికీ నిర్మాణంలో అవతకవకలు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని వెలుగులోకి ముఖేష్ చంద్రాకర్ తీసుకొచ్చారన్నారు. దీంతో చత్తీస్ గడ్ మంత్రి కూడా స్పందించి విచారణకు కమిటీని నియమించారన్న కోపంతో జర్నలిస్టులు హత్య చేయించడంలో కాంట్రాక్టర్ భారీ స్కెచ్ వేశారని ఆరోపిస్తున్నారు. మావోయిస్టు ఇలాకాలో పనులు చేస్తున్నందున అతనికి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా కల్పించినట్టుగా తెలుస్తోంది. తాను ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో ఉన్న కాంట్రాక్టర్ హత్యకు స్కెచ్ వేశారని ఆరోపిస్తున్నారు.

బీజాపూర్ బంద్…

ముఖేష్ చంద్రాకర్ హత్యకు నిరసనగా బీజాపూర్ జిల్లా కేంద్రంలో బంద్ పాటించారు. ఈ సందర్బంగా జర్నలిస్టులు రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు జర్నలిస్టులు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చనట్టయితే ఆదివారం నుండి నిరవధిక ఆందోళన చేపడుతామని, వాహనాల రాకపోకలు ఎక్కడిక్కడ స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ కు చెందిన బీజాపూర్ తో పాటు బస్తర్ డివిజన్ లో ఉన్న ఆస్తులన్నింటిని ప్రభత్వం స్వాధీనం చేసుకోవాలని, హత్యతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్, రితేష్ చంద్రాకర్ తో పాటు మిగతా వారిపై కేసు నమెదు చేసి మరణ శిక్ష పడేవిధంగా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సురేష్ చంద్రాకర్ కు భద్రత కోసం ఏర్పాటు చేసిన బలగాలను వెంటనే తొలగించాలని, ఆయనకు ఇచ్చిన అన్ని కాంట్రాక్టులను రద్దు చేయడంతో పాటు అతని బ్యాంకు ఖాతాలను, పాస్ పోర్టులను సీజ్ చేయాలని బీజాపూర్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ముఖేష్ చంద్రాకర్ మృతదేహం లభ్యమైన చట్టన్ పార వద్ద నిర్మించిన ఎన్ క్లోజర్ అక్రమమని వెంటనే దానిని కూల్చివేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గంగులూరు రోడ్డులో ఉన్న ప్లాంట్, వాహనాలను కూడా సీజ్ చేయాలని, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర సింగ్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ముఖ్యంగా ముఖేష్ చంద్రాకర్ ను అవరవీరుడిగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page