దిశ దశ, కరీంనగర్:
వడ్డించే వాడు మనవాడయితే ఏ మూలన కూర్చున్నా ఫర్వాలేదు అన్న నానుడికి సరిగ్గా సరిపోతారు కొంతమంది పోలీసు అధికారులు. అధికారంలో ఉన్న వారి బలమే తమకు అన్నింటా శ్రీరామ రక్ష అన్న భ్రమల్లోకి వెల్లిపోయిన మహానుభావుల పుణ్యమా అని చట్టాల్లోని లోసుగులే వారికి వరంగా మారిపోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయిన వాడయితే అందలం… కాని వాడయితే కటకటాల్లోకి తోసేయడం అన్నట్టుగా వ్యవహరించారు కొంతమంది అధికారులు. ఒక రకంగా చెప్పాలంటే కరీంనగర్ కమిషనరేట్ లోని కొన్ని స్టేషన్లలో ఐపీసీ, సీఆర్పీసీ అమలు చేయడం కంటే బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా చట్టాలనే మార్చేశారన్న అపవాదును మూటగట్టుకుంది కరీంనగర్ పోలీస్. నక్సల్స్ ఏరివేత సమయంలో దేశంలోనే కరీంనగర్ పోలీసు అంటే ఓ ప్రత్యేకతను సాధించుకుని చరిత్ర సృష్టించింది. ఆనాటి విపత్కర పరిస్థితుల్లో క్షణం ఒక యుగంగా జీవనం సాగించిన పోలీసులు తమ ప్రాణాలు ఏక్షణంలో అయినా పోతాయన్న భయంలోనే విధులు నిర్వర్తించారు. అటువంటి పోలీసు విభాగం నేడు అబాసుపాలయిన తీరు చూసి రిటైర్డ్ పోలీసు అధికారులు ఆవేదన పడ్డ తీరు అంతా ఇంతా కాదు.
‘‘ఉద్దేశ్యమే’’ కీలకం…
ఇండియన్ పీనల్ కోడ్ లోని కొన్ని సెక్షన్లలో
ఉద్దేశ్యం అనే పదం అత్యంత కీలకమని చెప్పక తప్పదు. ఉద్దేశ్యం అనే పదాన్ని కలిపితేనే సెక్షన్లు మారిపోవడమే కాకుండా తీవ్రత కూడా పెరిగిపోతుంది. దాడి చేసి కొట్టడంతో రక్త గాయం అయితే సెక్షన్ 324 కింద కేసు నమోదు చేయాల్సి ఉంటుంది… అయితే చంపాలనే ఉద్దేశ్యంతో దాడి చేశాడు అన్నట్టయితే సెక్షన్ 307 కిందకు వస్తుంది. అలాగే సెక్షన్ 448 ప్రకారం ఇంట్లోకి అక్రమంగా చొరబడిన కేసు నమోదు చేస్తారు, కానీ పెద్ద నేరం చేసేందుకు ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు అనే ఉద్దేశ్యాన్ని జోడిస్తే సెక్షన్ 452 కిందకు వస్తుంది. ఉద్దేశ్యం అనే పదం జోడిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్లలో నిందితునిపై క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు. అయితే అన్ని విషయాల్లోనూ ఈ సెక్షన్లను అప్లై చేశారని కాకుండా ఇలాంటి అనుకూలమైన రీతిలో వ్యవహరించారన్న ఆరోపణలు మాత్రం ఎదుర్కొన్నారు. అయితే ఐపీసీ సెక్షన్లలోనే కాకుండా కొంతమంది పోలీసు అధికారుల ఉద్దేశ్యాలు కూడా మారడంతో కూడా వరుస కేసులు నమోదు చేసిన సంఘటనలు కూడా లేకపోలేదు.
అడ్వకేట్ విషయంలోనే…
కరీంనగర్ కు చెందిన బీజేపీ నాయకుడు, న్యాయవాది భేతి మహేందర్ రెడ్డి విషయంలో జరిగిన తీరును పరిశీలిస్తేనే అప్పడు పోలీసు వ్యవస్థ ఎలా దాసోహం అయిందో అర్థం చేసుకోవచ్చు. భేతి మహేందర్ రెడ్డి మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశారంటూ అప్పుడు మంత్రి గంగుల కమలాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేశారు కరీంనగర్ పోలీసులు. క్రైం నంబర్ 303 సెక్షన్ 153, 505(2)లలో కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఈ కేసు నమోదయిన తరువాత చకాచకా పలు పోలీస్టేషన్లలో భేతి మహేందదర్ రెడ్డిపై ఫిర్యాదుల పరంపర కొనసాగింది. అట్రాసిటీ సెక్షన్లలో కూడా ఫిర్యాదులు కూడా అప్పటికప్పుడు సిద్దం అయ్యాయి. అయితే భేతి మహేందర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించేందుకు హైదరాబాద్ లో ఉంటే అప్పటికప్పుడు ఆయనను పట్టుకునేందుకు స్పెషల్ పోలీసు టీమ్స్ వెల్లి తీసుకొచ్చాయి. దీంతో కరీంనగర్ బార్ అసోసియేషన్ కూడా ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. ఒక దశలో తెలంగాణ వ్యాప్తంగా బహిష్కరణకు పిలుపునిస్తామని బార్ అసోయిషన్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, స్పష్టం చేయాల్సి వచ్చింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్ రావు భేతి మహేందర్ రెడ్డిపై కేసుల విషయంలో సీనియర్ పోలీసు అధికారులతో చర్చించి… ఆయనను అరెస్ట్ కాకుండా 41 ఏ సీఆర్పీసీ నోటీసు ఇప్పించేందుకు ఒఫ్పించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా పోలీసు అధికారులతో మాట్లాడి భేతి మహేందర్ రెడ్డిని ఇబ్బంది పెడితే బావుండదని, తప్పుడు కేసులు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. దీంతో అప్పుడు భేతి మహేందర్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు చాలా వరకు ఎఫ్ఐఆర్ కాకుండా మరుగున పడిపోయాయి. అయితే ఆయనను మాత్రం పోలీసు అధికారులు డేగకళ్లతో పరిశీలిస్తూ కట్టడి చేశారు. చివరకు ఉన్నతాధికారి చాంబర్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారంటే ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. మరో వైపున ఓ పార్టీకి అనుకూలమైన పోస్టును ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఓ యువకుడు ఓ ఫంక్షన్ లో కలిస్తే అప్పటి అధికార పార్టీ ముఖ్య నాయకుడి సమీప బంధువు సీరియన్ వార్నింగ్ ఇచ్చారట. చట్టం నీపై కన్నేస్తుంది జాగ్రత్తా అంటూ హెచ్చరికలు చేశారట. సోషల్ మీడియాలో తమ ఆవేదనను వెల్లగక్కిన వారిపై కూడా పోలీసులను ఎలా ప్రయోగించారో ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అంశాలపై లోతుగా ఆరా తీస్తే ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు కరీంనగర్ వాసులు. ఫిర్యాదు వెంట అధికారం ఉంటే సివిల్ కేసు కూడా క్రిమినల్ కేసుగా మారితే… సాధారణ బాధితులో ప్రతిపక్షానికి చెందిన వారో ఫిర్యాదు చేస్తే క్రిమినల్ కేసు కూడా సివిల్ కేసు అన్నరీతిలో స్పందన వచ్చేదన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే ప్రముఖుల ఫిర్యాదులతో హాడావుడి చేసిన పోలీసుల ఇతర విషయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శించలేదన్న వాదనలు కూడా ఉన్నాయి. నిందితులను పట్టుకొచ్చేందుకు మాకేం పని..? వాహనాలు సమకూరుస్తారా..? ఖర్చులకు డబ్బులు ఇస్తారా అంటూ పిటిషన్లర్లను ప్రశ్నించిన పోలీసు అధికారులు కూడా లేకపోలేదు. మంత్రి ఫిర్యాదుతో గంటల్లోనే పోలీసు వాహనం హైదరాబాద్ లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తే సామాన్యుడి విషయంలో మాత్రం అంతే స్థాయి స్పందన మాత్రం కనిపించ లేదన్న విమర్శలు కూడా లేకపోలేదు.