దిశ దశ, హైదరాబాద్:
రికమండేషన్ పోస్టింగులతో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతూ కాలం వెల్లదీసిన క్షేత్ర స్థాయి అధికారులపై చర్యలు తీసుకునే పనిలో ఉన్నతాదికారులు నిమగ్నం అయ్యారు. క్రమక్రమంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటుండమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. హైదరాబాద్ కమిషనరేట్ సహా ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధానం అమలు కానున్నట్టుగా స్పష్టం అవుతోంది.
శాంతి భద్రతలకే ప్రాధాన్యం…
రాష్ట్రంలో శాంతి భద్రతలే ప్రాధాన్యత అంశంగా పరిగణించిన పోలీసు అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపై వేటు వేస్తున్నారు. ఇంతకాలం తామేం చేసినా చెల్లిందన్న ధీమాతో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు ప్రభుత్వం మారి, కఠినంగా వ్యవహరించే అధికారుల పర్యవేక్షణ మొదలైనా కూడా తమ వైఖరిని మార్చుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సైబారాబాద్ కమిషనరేట్ లో ఇప్పటికే పలువురు పోలీసు అదికారులను సస్పెన్షన్ చేయడం, మరికొంతమందిపై బదిలీ వేటు వేస్తున్న పరంపరం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడి నిర్వాకాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ సీపీ కూడా కొరడా ఝులింపించాల్సి వచ్చింది. అంతేకాకుండా రికమండేషన్ లెటర్లు పట్టుకొస్తే పనిష్మెంట్ ఇస్తానంటు సీపీ వార్నింగ్ ఇచ్చారు కూడా. లా అండర్ ఆర్డర్ విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులు భావించడంతో ఇంతకాలం ప్రభుత్వ పెద్దల సాన్నిహిత్యంతో మెదిలిన అధికారులకు మింగుడుపడకుండా తయారైంది. తాజాగా కరీంనగర్ కమిషనరేట్ లో అయితే ముగ్గురు సీఐలను ఐజీపీ కార్యాలయంలో సరెండర్ చేశారు. శనివారం రాత్రి వెలువడిన ఈ ఉత్తర్వుల్లో సరెంబర్ చేస్తున్నట్టుగా స్పష్టం చేయడం గమనార్హం.
యూనిఫారాలు సిద్దం…
ఇకపోతే దశాబ్ద కాలంగా పోస్టింగులకు దూరంగా ఉండి లూప్ లైన్ ఉద్యోగాలకే పరిమితం అయిన పోలీసు అధికారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కూడా శాంతి భద్రతల పోస్టింగులకు అవకాశం లేకుండా అడ్జస్ట్ మెంట్ పోస్టింగులతో సరిపెట్టుకున్నారంటే లా అండ్ ఆర్డర్ లో పనిచేస్తున్న అధికారుల పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇక తాము శాంతిభద్రతల పోస్టింగులు అందుకోలేమని నిర్ణయానికి వచ్చిన పోలీసు అధికారులు కొందరు యూనిఫారాలను కూడా మూలన పడేశారు. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఇక తమకు పోస్టింగులు రావడం ఖాయమన్న ఆశలు చిగురుస్తున్నాయి. దీంతో ఎప్పుడైన పోలీసు అధికారుల నుండి బదిలీ ఉత్తర్వులు అందుకుంటామన్న ఆనందంతో లూప్ లైన్ విభాగాల్లో మగ్గిపోయిన పోలీసు అధికారులు యూనిఫారాలను సిద్దం చేసుకుంటున్నారని ఆ విభాగంలో జోరుగా చర్చ సాగుతోంది.
డాటా ఫుల్…
గత ప్రభుత్వంలో రికమండేషన్ పోస్టింగులకు పరిమితం అయిన వారే కాకుండా కొంతమంది పోలీసు అధికారులు ‘రింగ్’ లీడర్లుగా మారి ఎమ్మెల్యేలు, మంత్రులను మచ్చిక చేసుకుని లాబియింగ్ చేసిన వారూ కూడా ఉన్నారన్న విషయానికి సంబంధించిన దస్త్రాలు పోలీసు బాసుల వద్దకు చేరినట్టుగా తెలుస్తోంది. తమకంటూ ఓ ప్రత్యేకమైన సిండికేట్ ఏర్పాటు చేసుకున్న కొంతమంది పోలీసు అధికారులు రికమండేషన్ లెటర్లు ఇప్పించడంలో సఫలం అయిన ఘటనలు కొకొల్లలుగా ఉన్నాయి. పోస్టింగ్ ఇస్తూ విడుదలైన ఉత్తర్వులను కూడా తమ పరపతి ఉపయోగించి రద్దు చేయించి తమతో సాన్నిహిత్యంగా ఉన్న వారికే అండగా నిలిచిన వారి వివరాలు కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరిద్దరు పోలీసు అధికారులు అయితే ఏకంగా కమిషనర్లనే తమ గుప్పిట పెట్టుకుని కమిషనరేట్ అంతా ఆధిపత్యం చెలియించినట్టుగా కూడా ప్రచారంలో ఉంది. అంతేకాకుండా చట్ట ప్రకారం నడుచుకోకుండా బాధితులను నిందితులుగా చేర్చి… నిందితులను కాపాడిన వారి గురించి కూడా పూర్తి వివరాలు తయారైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సృతి మించి వ్యవహరిస్తున్న వారిపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోనున్న అధికారులు ఎంపీ ఎన్నికల తరువాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.