దిశ దశ, మహదేవపూర్:
మహదేవపూర్, పలిమెల మండలాల్లో వందలాది ఎకరాల్లో భూములు ఉన్న ఖాజా మోహినోద్దీన్ (పాషా దొర) విషయంలో సీలింగ్ యాక్టు అమలు చేయలేదా..? ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చిన ఈ చట్టం నుండి మినహాయింపు ఇచ్చారా..? ఆయన పేరిట ఉన్న భూములు వారసులు అమ్మడానికి కారణమేంటీ..? ఇప్పుడిదే చర్చ అటు రెవెన్యూ వర్గాల్లో ఇటు సామాన్య ప్రజల్లో సాగుతోంది.
సీలింగ్ యాక్ట్…
ఉమ్మడి రాష్ట్రంలో భూస్వాముల పేరిట వందల ఎకరాలు ఉండడం సరికాదని 1971లో ఆర్ఓఆర్ యాక్టును అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం 1973లో సీలింగ్ యాక్టు అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం పేరిట అమల్లోకి వచ్చిన ఈ విధానంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను స్వాధీనం చేసుకుంది. ఈ సమయంలో భూ స్వాములు కూడా తమకు సంబంధించిన వేలాది ఎకరాలను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. తహసీల్ రికార్డుల ఆధారంగా ప్రభుత్వం కూడా కఠినంగానే అమలు చేసింది. మిగులు భూములను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని నిరుపేదలకు పంచాలని భావించింది. అయితే ఈ సమయంలోనే పలిమెల పాషా దొర పేరిట ఉన్న భూములు కూడా ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే నంబర్లు, శివార్లు, విస్తీర్ణం తదితర పూర్తి వివరాలతో కూడిన భూములను స్వాధీనం చేసుకుంటున్నట్టుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఖాజా మోహినోద్దీన్ భూములను స్వాధీనం చేసుకున్న రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలించకుండానే లావాదేవీలను ఆమోదించడానికి కారణమేంటన్నదే అంతు చిక్కకుండా పోయింది. సీలింగ్ యాక్టు అమల్లో ఉన్నప్పుడు భూ యజమానులు ఇచ్చిన డిక్లరేషన్ వివరాలను సీలింగ్ విభాగంలో భద్ర పరిచారు. ఈ వివరాలు కేవలం తహసీల్దార్ కార్యాలయాల్లోనే కాకుండా రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రం, హైదరాబాద్ లోని సచివాలయంలో భద్ర పరిచారు. ఇందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించినట్టయితే ఆయా కార్యాలయాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా దొరికే అవకాశాలు లేకపోలేదు. కనీసం సీలింగ్ యాక్టు అమల్లో ఉన్న భూముల వివరాలను సంబంధిత విభాగాల నుండి సేకరించినా అవి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉండేది.
స్వాధీనం చేసుకున్నదెంత..?
అయితే మహదేవపూర్, పలిమెల మండలాల్లోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో ఉన్న పాషా దొరకు సంబంధించిన భూముల్లో ఎంత విస్తీర్ణం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, అప్పుడు భూ యజమానిగా ఆయన భూములు ఎవరెవరి పేరిట ఉన్నాయని డిక్లరేషన్ ఇచ్చారు అన్న వివరాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఆయన వారసులు మహదేవపూర్, పలిమెల మండలాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న భూములను విక్రయించినట్టుగా రికార్డులు చెప్తున్నాయి. ఇప్పటికే చాలా భూములు పదులు సంఖ్యలో భూ యజమానులు మారినట్టుగా తేటతెల్లం అవుతోంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డుల్లో పట్టదారులు మారిపోయినట్టుగా రికార్డులు వెల్లడిస్తున్న నేపథ్యంలో సీలింగ్ యాక్టు వివరాలను సేకరించినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక వేళ పాషా దొర భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోనట్టయితే ఇందుకు గల కారణాలను కూడా అప్పుడు రికార్డుల్లో రాయించే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద ఎత్తున భూములు ఉన్న వారి విషయంలో మాత్రం అప్పటి ప్రభుత్వం సీలింగ్ యాక్టు అమలు చేయడంలో కఠినంగానే వ్యవహరించిందన్నచర్చ నేటికీ సాగుతోంది. ఈ క్రమంలో పాషా దొరకు సంబంధించిన భూముల వివరాలు కూడా సీలింగ్ విభాగంలో ఉండే అవకాశం లేకపోలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వివరాలను సేకరించినట్టయితే ఆయన వారసులు భూ సంస్కరణల చట్టాన్ని అతిక్రమించారా లేదా అన్న విషయం తేటతెల్లం కానుంది. ఈ వాస్తవాలను శోధించడం వల్ల ప్రభుత్వం చేతుల్లోకి కూడా మిగులు భూమి వచ్చి చేరే అవకాశం ఉండడంతో పాటు అప్పుడు పాషా దొర డిక్లరేషన్ లో పట్టాదారులుగా పేర్కొన్న వారి వారసులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా సీలింగ్ భూములుగా గుర్తించ బడిన వాటిలో పట్టాదారులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా లావాదేవీలు జరిపే అవకాశం లేదని స్పష్టం చేస్తోంది. వాటన్నంటిని కూడా అక్రమ క్రయ విక్రయాలుగా గుర్తించి ప్రభుత్వం ఇప్పుడు కూడా స్వాధీనం చేసుకునే విధంగా అప్పుడు చట్టం తయారు చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా సీలింగ్ పరిధిలో ఉన్న భూములను విక్రయించిన విషయంలో భూస్వామి వారసులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేం అవకాశం ఉంటుంది.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు…
సీలింగ్ యాక్టు అమలు చేసినప్పుడు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భూములను స్వాధీనం చేసుకుని ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. అప్పుడే భూములకు సంబంధించిన వివరాలు సీసీఎల్ఏ పరిధిలోని సీలింగ్ వింగ్ లో కూడా ఉంటాయని తెలుస్తోంది. మహదేవపూర్, పలిమెల మండలాల్లోని పాషా దొర భూములకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించినట్టయితే సీలింగ్ యాక్టు ప్రకారం ఎంత భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉందో తెలిసే అవకాశం ఉంటుంది. సీలింగ్ ద్వారా సేకరించిన భుములు నిరుపేదలకు ఇవ్వాలని అందులో ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సొంత ఇళ్లు కూడా లేదని, వారి పేరిట భూములు కూడా లేవన్న నిబంధనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సీలింగ్ భూములు తమకు కెటాయించాలని నిరుపేదలు జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయి విచారణ జరిపి రెవెన్యూ అధికారులు దరఖాస్తులను పరిశీలించి అన్ని విధాలుగా అర్హులైన వారేనని ధృవీకరించి ఫైలును జిల్లా కలెక్టర్ కు పంపించాలి. ఆ తరువాత కలెక్టర్ ప్రొసిడింగ్ జారీ చేస్తేనే సీలింగ్ భూములను అలాట్ చేయాలని నిబంధనలు చెప్తున్నాయి. స్థానికంగా ఉండే తహసీల్దార్లో, ఆర్డీఓలో సీలింగ్ భూములను కెటాయించినట్టయితే అవి చెల్లుబాటు అయ్యే అవకాశమే లేదని చట్టం స్పష్టం చేస్తోంది.
ఆ లాజిక్ తో…
అయితే 1973లో సీలింగ్ యాక్టు అమలు అయిన తరువాత అందుకు అనుగుణంగా రెవెన్యూ రికార్డులను మార్చడంలో అధికార యంత్రాంగం విఫలం అయింది. 1బి నుండి పహణీ వరకు సీలింగ్ భూమిగా గుర్తించినట్టుగా తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న ప్రతి రికార్డును మార్చడంలో అప్పటి అధికార యంత్రాంగం విఫలమైందని స్పష్టం అవుతోంది. ఈ నేఫథ్యంలో సీలింగ్ పరిధిలో ఉన్న భూమా కాదా అన్న విషయాన్ని ధృవీకరించుకునేందుకు అప్పటి అధికార యంత్రాంగం సంబంధిత విభాగంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్టయితే వాస్తవాలు తెలిసేవన్న చర్చ జరుగుతోంది. కేవలం రెవెన్యూ రికార్డులను ఆధారం చేసుకుని లావాదేవీలు జరిపిన అధికారులు అనుబంధ విభాగాల వివరాలను సేకరించడంలో విఫలం కావడమే విస్మయానికి గురి చేస్తోంది. 2016లో అప్పటి తహసీల్దార్ మార్కెటింగ్ గోదాములకు భూమిని కెటాయించే విషయంలో ఇచ్చిన నివేదికలో మాత్రం అసిస్టెండ్ డైరక్టర్ సీలింగ్ విభాగానికి లేఖ రాసినట్టుగా మాత్రమే ఉంది. కానీ సంబంధిత శాఖ నుండి ప్రత్యుత్తరం వచ్చిందా లేదా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. అయితే 2007లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం భూ సేకరణ జరిపినప్పుడు భూ యజమాని వారసులం ఉన్నామని దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు రెవెన్యూ అధికారులు సీలింగ్ యాక్టు విషయాన్ని పట్టించుకోకుండానే సదరు భూ యజమాని వారసులు ఉండడంతో వీరు సన్నకారు రైతులేనన్న భావనకు వచ్చి వారికి పరిహారం అందించాలని మహదేవపూర్ రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడం వెనక ఆంతర్యం ఏంటో కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సామాన్యుడు దరఖాస్తు చేసినట్టయితే అతని ఇతర విబాగాల్లో సబ్సీడీలు కానీ, ప్రభుత్వం నుండి సహాయం కానీ పొందాడా లేదా అన్న వివరాలను సేకరించిన తరువాతే లాభోక్తుడిగా గుర్తించే వారు. కానీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమిని సంరక్షకులుగా ఉండాల్సిన అధికార యంత్రాంగం మాత్రం అలా ఎందుకు వ్యవహరించలదేన్నదే అంతు చిక్కడం లేదు. బ్యాంకులో రుణం తీసుకోవాలన్నా దాని పరిధిలోని ఇతర బ్యాంకుల నుండి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకరావాలన్న నిబంధనలు అమలు చేస్తున్నా… ప్రభుత్వ ఆధీనంలో భూమి విషయంలో మాత్రం ఇలాంటి అంశాలను ఎందుకు పట్టించుకోలేదన్నదే పజిల్ గా మారింది. కనీసం సంక్షేమ పథకాల కోసం కొనుగోలు చేసినప్పుడు అయినా సీలింగ్ రికార్డులను పరిశీలిస్తే ప్రభుత్వానికి లాభం చేకూరదని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘాల మండల అధ్యక్షుడు మేరుగు లక్ష్మణ్ అంటున్నారు.