భారత వ్యతిరేక పోస్టర్లుపై గుర్రు
దిశ దశ, న్యూ ఢిల్లీ:
ఖలిస్తాన్ వేర్పాటు వాదులకు వంతపాడుకుంటూ వచ్చిన కెనడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని అధికార యంత్రాంగం యూ టర్న్ తీసుకుంటున్నట్టుగా ఉంది. ఇంత కాలం భారతదేశానిదే తప్పని వాదించడంతో పాటు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామన్న రీతిలో వ్యవహరించిన కెనడాలోని సర్రే నగరంలో అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తూ ఇండియాలో అశాంతి నెలకొల్పేందుకు పరోక్షంగా సహకరిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా నిజ్జర్ హత్యపై భారత్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇందుకు భారత్ కూడా కౌంటర్ ఇవ్వడంతో పాటు అంతర్జాతీయంగా కూడా కెనడా వ్యవహారశైలీ, ఉగ్ర మూకల వల్ల జరుగుతున్న నష్టం గురించి వివరించే ప్రయత్నం చేసింది. మరో వైపున ఏన్ఐఏ కూడా ఖలీస్తాన్ వేర్పాటు వాద ఉగ్ర మూకలపై కూడా కఠినంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. భారత్ నుండి ఎదురైన ముప్పేట దాడితో అటు వేర్పాటు వాదులు, ఇటు కెనడా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరయినట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా కెనడాలో ప్రధాని ట్రూడో చరిష్మా కూడా గణనీయంగా పడిపోయినట్టుగా కొన్ని సర్వేలు తేటతెల్లం చేశాయి. కెనడాలో స్థిరపడ్డ ఇతర భారతీయులంతా కూడా ట్రూడోకు వ్యతిరేకంగా ఉన్నారని తేలడంతో ఎన్నికల్లో ఫలితాలు తమకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కెనడా ప్రభుత్వం దృష్టికి వెల్లింది. దీంతో భారతదేశానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన పోస్టర్లు, బ్యానర్లను తొలగించాలంటూ అక్కడి అధికార యంత్రాంగం ఆదేశాలు జారి చేస్తుండడం విశేషం. కెనడాలోని సర్రే నగరంలో ఏర్పాటు చేసిన ఖలిస్తాన్ అనుకూల, భారత్ వ్యతిరేక పోస్టర్లను తొలగించాలని కుండబద్దలు కొట్టింది అక్కడి అధికార యంత్రాంగం. ఎలాంటి విద్వేష ప్రసంగాలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని సర్రే సిటీలో మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఏది ఏమైనా కెనడాలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారత్ అనుకూల వాతావరణం కనిపిస్తుండడంతో ట్రూడో బాహాటంగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రకటన చేస్తారా లేక తన వైఖరిలో మార్పు లేదని తన తండ్రిలాగానే వ్యహరిస్తారా అన్నది ముందు ముందు తేలనుంది.