కరీంనగర్ T0 హసన్ పర్తి…. పూర్తయిన సర్వే… త్వరలోనే డీపీఆర్

దిశ దశ, కరీంనగర్:

శాబ్దాల నాటి కల నేడో రేపే కార్య రూపం దాల్చనుంది. ప్రతిపాదనల దశల్లోనే మగ్గిపోయిన ఆ ఫైలుకు మోక్షం లబించింది. తొలి అడుగు పూర్తి కావడంతో ఈ ప్రాంత వాసుల స్వప్నం నెరవెరబోతోంది. ఎట్టకేలకు సర్వేలు, డీపీఆర్ ప్రక్రియ వైపు ఈ రైల్వే లైన్ పనులు ముందుకు సాగుతండడం శుభ సూచకం.

కరీంనగర్ నుండి… 

కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు నేరుగా రైల్వే లైన్ వేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం కరీంనగర్ నుండి వరంగల్ మీదుగా వెళ్లాలంటే పెద్దపల్లి వరకు వెల్లాల్సిన పరిస్థితి. అయితే తాజాగా ప్రతిపాదనలు చేసిన ఈ రైల్వే లైన్ కు మోక్షం కల్గినట్టయితే దూరాభారం తగ్గడమే కాకుండా దేశ వాణిజ్య రాజధానికి దక్షిణాది రాష్ట్రాలకు కూడా కనెక్టవిటీ పెరగనుంది. 61.80 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన కరీంనగర్, హసన్ పర్తి రైల్వే లైన్ కోసం రూ. 1.54 కోట్ల రూపాయల బడ్జెట్ కెటాయించడంతో ఇందుకు సంబంధించిన సర్వే కూడా జరిపారు. ఇటీవలే పూర్తయిన ఈ సర్వే ఆధారంగా ఎంతమేర భూ సేకరణ చేపట్టాల్సి ఉంటుందన్న నివేదికను సర్వే బృందాలు రైల్వే విభాగానికి పంపించనున్నాయి. ఆ తరువాత  రైల్వై లైన్ రూట్ ఏంటి..? స్టేషన్ల వివరాలతో  కూడా పూర్తి వివరాలు, కరీంనగర్ రైల్వై స్టేషన్ లో తీసుకోవల్సిన చర్యలు, ట్రాక్స్, ప్లాట్ ఫామ్స్ ఎన్ని నిర్మించాలి ఇందుకు ఎంతమేర నిధులు అవసరం ఉంటాయి..? మార్గ మధ్యలో ఉన్న స్టేషన్ల వద్ద భూ సేకరణ ఎంత మేర సేకరించాల్సి ఉంటుంది, క్రాస్ లెవల్స్ తదితర పూర్తి వివరాలతో కూడిన డీపీఆర్ తయారు చేయనున్నారు. డీపీఆర్ రైల్వే విభాగానికి చేరిన తరువాత భూ సేకరణ పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

కేంద్ర బిందువుగా…

ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణాకు కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్ హసన్ పర్తి, కరీంనగర్ రైల్వేలైన్ తో మెయిన్ జంక్షన్ పాయింట్ కానుంది. కరీంనగర్ మీదుగా నిజామాబాద్, షోలాపూర్, ముంబాయి తదితర ప్రాంతాలకు వెల్లేందుకు దూరం తగ్గనుండి ఇప్పటి వరకు కేరళ, తమిళనాడు, ఏపీ తదితర రాష్ట్రాలకు చెందిన రైళ్లన్ని కూడా ఖాజీపేట, సికింద్రాబాద్ మీదుగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ రైల్వేలైన్ పూర్తయితే మాత్రం వరంగల్, ఖాజీపేటల నుండి నేరుగా కరీంనగర్ చేరుకోనున్నాయి. దీంతో రైల్ ప్రయాణీకులకు కూడా టికెట్ ధర తగ్గడంతో పాటు జర్నీ టైం కూడా తగ్గిపోనుంది. ఇప్పటి వరకు రోడ్డు మార్గంలోనే సెంటర్ గా మారిన కరీంనగర్ ఈ ప్రాజెక్టు ఆచరణలోకి వచ్చినట్టయితే పెద్ద జంక్షన్ పాయింట్ గా మారనుంది. దీంతో ప్రయాణీకుల రాకపోకలతో పాటు, వాణిజ్య రాజధాని ముంబాయికి సంబంధాలు మరింత మెరుగు అవుతాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన చాలా మంది కూడా ముంబాయి, షోలాపూర్ వంటి ప్రాంతాల్లో వలస వెల్లి జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వారందరికి కూడా రవాణా సౌకర్యం మెరుగు కానుంది.

1976 నాటి ప్రతిపాదన…

ఈ రైల్వే రూట్ కోసం 1976లోనే ప్రతిపాదనలు సిద్దమైనప్పటికీ కార్యరూపం దాల్చలేకపోయింది. కరీంనగర్ ఎంపీగా పొన్నం ప్రభాకర్ కూడా ఈ ట్రైన్ రూట్ కు నిధులు మంజూరు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయం గురించి ప్రధాని నరేంద్రమోడీని అభ్యర్థించడంతో పాటు రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ ను పదేపదే కలసి వినతి చేశారు. దీంతో తొలిదశ అయిన రైల్వే లైన్ సర్వే పూర్తి అయింది. డీపీఆర్ అందగానే ఇందుకు సంబంధించిన నిధుల విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఈ రైల్వై లైన్ కు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేసినట్టయితే కరీంనగర్ జిల్లా రూపు రేఖలే మారిపోనున్నాయి.

You cannot copy content of this page