జర్నలిస్టేతరులకు నివేశన స్థలాలు…

కరీంనగర్ ప్లాట్ల కెటాయింపుతో వెలుగులోకి…

దిశ దశ, కరీంనగర్:

నాలుగో స్తంభానికి సర్కారు బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తున్నా… కొంతమంది కారణంగా ప్రతిఫలాలు జర్నలిస్టేతరులకు అందుతున్నాయా..? గుత్తాధిపత్యం సాధించిన పెద్దలు కొంతమంది ప్రభుత్వ పథకాలను దారి మళ్లించేందుకు కుట్రలు చేశారా..? లైన్ అకౌంట్ తో జీవనం సాగించే రిపోర్టర్ల కడుపు కొట్టే విధంగా వ్యవహరిస్తున్నారా..? అంటే అవుననే చెప్తోంది కరీంనగర్ జర్నలిస్టులకు ఇచ్చిన ప్లాట్ల జాబితా.

అక్షరం… ఆయుధం…

అక్షరం… ఆయుధం అంటూ పాఠకుల్లో సరికొత్త ఊపు తీసుకొచ్చిన ఆంద్రజ్యోతి యాజమాన్యం సామాన్యులకు బాసటగా నిలుస్తానని సంకేతాలు స్పష్టంగా ఇచ్చేసింది. 2002లో పున: ప్రారంభం అయిన ఆంధ్రజ్యోతి ఎండీగా జర్నలిస్టుగా సుదీర్ఘ కాలం పని చేసిన వేమూరి రాధకృష్ణ నేతృత్వంలో ప్రారంభం కావడంతో సామాన్య రిపోర్టర్లకు కూడా ఎంతో స్పూర్తిని ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఎడిషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఏక కాలంలో ఆంధ్రజ్యోతి దినపత్రికను ప్రారంభించి సంచలనం సృష్టించారు వేమూరి. చారిత్రాత్మకంగా ఎండీ వేమూరి రాధాకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ నాడు జర్నలిస్టు సమాజం అంతా కూడా అబ్బురపడిపోయింది. నిబద్దతతో కూడిన జర్నలిస్టులకు వేదికగా ఆంధ్రజ్యోతి నిలుస్తోందని భావించారంతా. ఇటీవల కాలంలో సంస్థలో జరుగుతున్న వ్యవహరాలు పత్రికకు మాయని మచ్చగా మారిపోతున్నాయి. ఎండీ వేమూరి రాధాకృష్ణ వద్ద మంచి మార్కులు వేయించుకున్న కొంతమంది జర్నలిస్టులు, సంస్థలో పనిచేస్తున్న వారు తీసుకుంటున్న నిర్ణయాలు సంస్థను అబాసుపాలు చేసే విధంగా ఉంటున్నాయి. దీంతో సాధారణ జర్నలిస్టుల జీవితాలతో చెలగాటమాటమాడుతున్నారన్న అపవాదు ఆ సంస్థపై పడుతోంది.

ప్లాటు ఎలా..?

కరీంనగర్ లో 2006లో జర్నలిస్టులకు కెటాయించిన భూముల తరువాత మళ్లీ నివేశన స్థలాలు కెటాయించలేదు. పలుమార్లు ఈ అంశం కొలిక్కివచ్చినట్టే వచ్చి చివరి క్షణంలో మరుగునపడిపోయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. చివరకు 2024లో జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇప్పించే విషయంలో అప్పటి మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో తమ చిరకాల వాంఛ నెరవేరుతోందన్న సంబరంలో కరీంనగర్ జర్నలిస్టులు సంబరాలు చేసుకున్నారు. పట్టా కాగితాలు చేతికి వచ్చిన తరువాత వెలుగులోకి వచ్చిన జాబితాలో జర్నలిస్టేతరులు ఉండడం… ఇంకా చాలమంది రిపోర్టర్లకు నివేశన స్థలాలు రాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఆంధ్రజ్యోతి సంస్థలో జర్నలిస్టుగా పనిచేయని వారికి కూడా ప్లాట్లు కెటాయించిన విషయం వెలుగులోకి రావడంతో కరీంనగర్ రిపోర్టర్లంతా నివ్వెరపోయారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా స్థానికంగా ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తికి ఈ ప్లాట్ కెటాయించినట్టుగా జాబితాలో ఉండడం… ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న వారందరిని కూడా ఆశ్యర్యానికి గురి చేసింది. కానీ చిన్న స్థాయిలో ఉన్న తాము పెద్ద సార్ల వరకూ చేర్చే పరిస్థితి లేదని చాలా మంది ఆంధ్రజ్యోతి ఉద్యోగులు గుసగుసలాడుకున్నారు తప్ప ఎదురుతిరిగే ధైర్యం చేయలేకపోయారు. ఎడిషన్ సెంటర్ లో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న వారికి జర్నలిస్టు కోటాలో నివేశన స్థలం కెటాయించడం మాత్రం స్థానిక జర్నలిస్టులను విస్మయపరిచింది.

అక్రిడేషన్…

ఇకపోతే ఆంధ్రజ్యోతి యాజమాన్యం కరీంనగర్ ప్లాట్ల విషయంలో లోతుగా అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కరీంనగర్ జర్నలిస్టులకు నివేశన స్థలాలు కెటాయించిన జాబితాలో ఆంధ్రజ్యోతి సంస్థలో పనిచేస్తున్న వారిలో ఆ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పేరు ఉండడంతో అసలేం జరిగింది అన్న కోణంలో ఆరా తీయాల్సిన అవసరం ఉంది. వేలల్లో జీతాలు తీసుకుంటున్న వారికి ప్లాటు కెటాయించడం సరికాదన్న వాదనలు తెరపైకి వచ్చినప్పుడు సదరు వ్యక్తికి అక్రిడేషన్ కార్డు ఉందన్న కారణంతో ప్లాట్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అంటే వార్తా సేకరణలో నిమగ్నం అయిన జర్నలిస్టులకు కాకుండా అడ్మినిస్ట్రేషన్ కే పరిమితమైన వారు అక్రిడేషన్ కార్డులు తీసుకోవడం కూడా సమంజసం కాదన్న విషయాన్ని యాజమాన్యం గుర్తించాలన్న అభ్యర్థన కరీంనగర్ జర్నలిస్టుల నుండి వ్యక్తం అవుతోంది. సదరు వ్యక్తికి అక్రిడేషన్ కార్డు కూడా ఇచ్చినట్టయితే ఈ విషయంలో జర్నలిస్టుల పక్షపాతి అయిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ గారు చొరవ తీసుకుని పారదర్శకమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు జర్నలిస్టులు.

You cannot copy content of this page