సామాన్యులకో నీతి… ప్రముఖులకో రీతా..?

కాళేశ్వరంలో గర్భాలయ ప్రవేశం తీరు…

భక్తుల విమర్శలు…

దిశ దశ, భూపాలపల్లి:

గర్భాలయంలోకి వెల్లే భక్తులు సాంప్రాదాయ దుస్తులు వేసుకోవాలన్న నిబంధనలకు దేవాదాయ శాఖ తిలోదాకాలిచ్చిందా..? లేక ప్రముఖులకు మినహాయింపు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టిందా..? ఇప్పుడిదే చర్చ భక్తుల్లో సాగుతోంది. దేశంలోనే అరుదైన క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీఆర్ఎస్ఎల్పీ నేతల పూజలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగు నీరందించేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎగువ ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడిందని, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్ ల సామర్థ్యాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి రాష్ట్ర ప్రజలకు వివరించాలని భావించిన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ఎల్పీ బృందం, ముఖ్య నాయకులు శుక్రవారం పర్యటన చేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికిన అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఈ సందర్భంగా గర్భాలయంలోకి కూడా చట్ట సభల ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సాంప్రాదాయ దుస్తులు వేసుకోకుండానే వెల్లడం గమనార్హం. ఆలయాల్లోకి సాంప్రాదాయ దుస్తులను మాత్రమే వేసుకోవాలని, పంచె, ఉత్తరీయం ఉండాలన్న నిబంధనలు విధించిన దేవాదాయ శాఖ ప్రముఖుల విషయంలో మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీసింది. ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ కంపల్సరీ అన్న విధానం విషయంలో ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

సామాన్యులకైతే…

ఇదే ఆలయంలో సామాన్య భక్తులు అయితే ఖచ్చితంగా సాంప్రాదాయ దుస్తులు వేసుకోవాలని చెప్పే ఆలయ యంత్రాంగం ప్రముఖుల విషయంలో ఎందుకు పట్టించుకోలేదోనన్న విషయం అంతు చిక్కకుండా పోయింది. సాధారణ భక్తులు గర్భాలయంలోకి వెల్లి స్వామి వారికి అభిషేకం చేయాలన్నా, అర్చన చేయాలన్న కూడా సాంప్రాదాయ దుస్తులు ఖచ్చితంగా ఉండాలని చెప్తుంటారని, వీఐపీలకు ఎందుకు సూచించకపోవడం వెనక కారణం ఏంటని స్థానికంగా చర్చ సాగుతోంది.

గర్భాలయంలో చిత్రీకరణ…

మరో వైపున గర్భాలయంలో వీడియోలు, ఫోటోలు తీయడం దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్దమైనప్పటికీ బీఆర్ఎస్ఎల్పీ నాయకుల దర్శనం విషయంలో మినహాయింపు ఇవ్వడం కూడా అభ్యంతరకరంగా మారింది. సాధారణ భక్తుల మొబైల్ ఫోన్లు రాజగోపురానికి ముందు ఉన్న క్లాక్ రూంలో పెట్టాలని సూచించే కాళేశ్వరాలయ యంత్రాంగం ప్రముఖుల దర్శనానికి సంబంధించే పూజలను చిత్రీకరించేందుకు ఎలా అనుమతిచ్చారోనన్నదే విచిత్రంగా మారింది. ప్రముఖుల దర్శనాలు, ప్రత్యేక పూజలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తీరే ఇందుకు ఉదాహారాణగా చెప్పవచ్చు. చట్టాలను తయారు చేసే సభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యులు ఆలయ సాంప్రాదాయాలను పక్కన పెట్టడం… వారి దర్శనాల సమయంలో ఆలయ ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం అందరిని విస్మయపరిచింది.

You cannot copy content of this page