దిశ దశ, హైదరాబాద్:
భాగ్యనగరం ఇల్లీగల్ దందాగాళ్లకు అడ్డగా మారిపోయిందా..? డ్రగ్స్, గంజాయి వంటివే కాకుండా నగదుతో హవాలా దందా చేసే వాళ్లకూ సెంటర్ గా మారిందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ చేస్తున్న దాడుల్లో అక్రమ వ్యవహారాలతో పాటు హవాలా మాఫియా ఉనికి కూడా బయటపడుతోంది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా హవాలాగాళ్లు కూడా పెధ్ద ఎత్తున డెన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క సైబారాబాద్ కమిషనరేట్ పరిధిలోనే రెండు రోజుల్లో రెండు ముఠాలను ఎస్ఓటీ టీమ్స్ పట్టుకున్నాయి. ఇదే విధానంతో సిటీ అంతా జల్లెడ పడితే ఈ వ్యవహారానికి సంబంధించిన మూలాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.
రెండు రోజుల్లో…
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఎస్ఓటీ టీమ్ దాడి చేసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్నోవా క్రిస్టా వెహికిల్ లో ఎస్ఓటీ, మాదాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భాగంగా సోదాలు చేశారు. ఈ వాహనంలో రూ. 50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని విచారించగా హవాలా మార్గంలో దారి మళ్లిస్తున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాయదుర్గం పోలీసులు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కూడా ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో కూడా దాడులు నిర్వహించగా రూ. 19 లక్షల 2 వేల రూపాయల హవాలా డబ్బును స్వాధీనం చేసుకోగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే సుమారు రూ. 70 లక్షల మేర హవాలా ద్వారా దారి మల్లుతున్న నగదును సీజ్ చేశారంటే ఈ దందాపై స్పెషల్ ఆపరేషన్ చేపడితే రూ. కోట్లలో సాగుతున్న దందా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. గతంలో కూడా హైదరాబాద్ నగరం నడిబొడ్డున కూడా పెద్ద ఎత్తున డబ్బులు దొరికినప్పటికీ లోతుగా ఆరా తీయకపోవడంతో హవాలా వంటి అక్రమ దందాగాళ్లు వ్యాపారం చేయడం మానుకోలేదు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఇటీవల కాలంలో పోలీసులు స్పెషల్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టండంతో హవాలా గుట్టు కూడా బట్టబయలు అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాపారానికి డెన్ గా మారిపోయిన ప్రాంతాలను గుర్తించి స్పెషల్ ఆపరేషన్ చేపడితే భారీ స్కాం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.