కరీంనగర్ బీఆర్ఎస్ పాలిటిక్స్
దిశ దశ, కరీంనగర్:
రాజకీయ చైతన్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వైవిద్యమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఎక్కడ ఏం జరిగినా ఆ నాయకుడే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి కనపడుతోంది. అసమ్మతి వాదులను అస్మదీయులుగా మార్చుకునే విషయంలో ఆయన ఎంట్రీ ఇస్తుండడంతో పార్టీలో వన్ మెన్ ఆర్మీగా మారిపోయాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అంతటా ఆయనే…
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎదురయ్యే పరిస్థితులన్నింటిని కూడా చక్కదిద్దే బాధ్యతలు అన్ని కూడా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పైనే పడుతున్నాయి. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఆయన ప్రత్యక్ష్య ప్రమేయం లేకుండా వ్యవహారాలు సరిదిద్దే పరిస్థితులు లేకుండా పోయాయన్నట్టుగా తయారైంది జిల్లా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. గతంలో హుజురాబాద్ ప్రాంత నాయకులు తమ గోడు మంత్రి గంగుల కమలాకర్ ముందు వినిపించినప్పటికీ ఆ తరువాత బోయినపల్లి వద్దకు వెల్లి కూడా పార్టీలో నెలకొన్న పరిణామాలు చెప్పుకుని బోరుమన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన పార్టీ నాయకులంతా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీరుపై ఫిర్యాదు చేసినప్పుడు కూడా మంత్రి గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్ కుమార్ లనే కలిశారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కూడా వినోద్ కుమార్ జోక్యం సాధారణంగా మారిపోయింది. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకోగా ఆయనను మొదట సముదాయించి ఒప్పించడంలో బోయినపల్లి సఫలం అయ్యారు.
తాజా పరిణామలు…
సాధరణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా జిల్లా రాజకీయాలు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రీకృతంగానే సాగుతున్నాయి. తాజాగా హుజురాబాద్ బీఆర్ఎస్ నాయకులు అసమ్మతితో పార్టీలు ఫిరాయించేందుకు సమాయత్తం అయ్యారు. ఈ సమాచారం అందగానే బోయినపల్లి వినోద్ కుమార్ నేరుగా హుజురాబాద్ చేరుకుని ఇక్కడి నాయకులతో మంతనాలు జరిపారు. అయినప్పటికీ ఫిరాయింపుల ప్రక్రియ యథావిధిగానే కొనసాగుతుండడంతో నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వారిని బుజ్జగించే పనిలో నిమగ్నం అయ్యారు. జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకోవడంతో వినోద్ కుమార్ ఆమెను సొంతగూటికి తీసుకరావడంలో సఫలం అయ్యారు. 24 గంట్లలోనే ఎంపీపీ పార్టీ మారడం స్థానికంగా చర్చకు దారి తీసింది. మమతను సొంతగూటికి చేర్చడంలో సక్సెస్ అయిన ఆయన అసమ్మతితో రగిలిపోతున్న ఇతర నాయకులు గులాభి దండు నుండి విడిపోకుండా ఉండేందుకు మంత్రాంగం చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా అసమ్మతి వాదులతో బోయినపల్లి మాట్లాడుతూ వారికి అన్నింటా అండగా ఉంటానని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీ బాధ్యులేరీ..?
అయితే కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక్కరే కీలక భూమిక పోషిస్తుండడం గమనార్హం. పార్టీ జిల్లా అధ్యక్షునితో పాటు ఇతర ముఖ్య నాయకులు ఉన్నప్పటికీ అసమ్మతిని చల్లార్చే విషయంలో వినోద్ కుమార్ స్పెషలిస్ట్ గా మారిపోయారన్న చర్చ కూడా ఇంటా బయట సాగుతోంది.