దిశ దశ, హైదరాబాద్:
దేశంలోనే రిచెస్ట్ ఎంపీ అభ్యర్థుల్లో ఆయన ఒకరు. తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పేర్కొని అందరిని షేక్ చేసేశారు. సింపుల్ గా తిరుగుతూ ఉండే ఆయన ఇంత ఆస్థిపరుడా అని తెలియని వారు అనుకుంటుంటే… ఆయనకు ఇంతపెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయని ఊహించలేకపోయామని మరికొందరు అనుకుంటున్నారు. తెలంగాణకు చెందిన ఈ అభ్యర్థి అఫిడవిట్ లో పేర్కొన్న అంశాల వివరాలు ఇవే. సోమవారం చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులందరికి కలిపి రూ. 4568 కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో వెల్లడించారు. అపోలో హస్పిటల్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, పీసీఆర్ ఇన్వెస్టిమెంట్స్, సిటాడెల్ ఆర్ సెర్చ్, కుంకుమ సొల్యూషన్స్ తో పాటు ఇతర కంపెనీల్లో షేర్లతో పాటు తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట స్థిర, చరాస్థులు ఉన్నాయని కొండ విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు. ఆయన పేరిట రూ. 1240 కోట్ల ఆస్థి, ఆయన భార్య సంగీత రెడ్డి పేరిట 3,208 కోట్లు, కొడుకు పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 108 కోట్లగు వివరించారు. అలాగే రూ. 11 కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారం కూడా ఉన్నాయని తెలిపారు. పుప్పాలగూడలోని అపర్ణ అమృతంలో రెండు విల్లాలు, చేవెళ్ల, రాజేంద్రనగర్, చిత్తూరులో వ్యవసాయ భూములు ఉండగా సొంత కారు మాత్రం లేదని తెలిపారు. న్యూఢిల్లీలోని ద్వారకానగర్ ఛీటింగ్ కేసుతో సహా నాలుగు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.