ఆయన అక్కడ… ఈమె ఇక్కడ…

హుజురాబాద్ ఎన్నికల తీరు…

ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికలు…

రెండు చోట్ల నిల్చున్న ఈటల

దిశ దశ, హుజురాబాద్:

రెండు దశాబ్దల పాటు అనుబంధం పెనవేసుకున్న ఆ నేత ఇంటా బయటా నెగ్గేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండు స్థానాల నుండి పోటీ చేయడమే ఒక సవాల్ అయితే… రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల ప్రచార బాధ్యతల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. దీంతో సొంత నియోజకవర్గంలో భార్యకు ప్రచార బాధ్యతలు అప్పగించి, కొత్త నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.

ఈటల ఇలా…

హుజురాబాద్ చరిత్రలోనే తొలిసారి సాక్షాత్కరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుండి అప్రతిహతంగా గెలుచుకుంటూ వస్తున్న ఈటల రాజేందర్ ఈ సారి రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నుండి కూడా రాజేందర్ బరిలో నిలిచారు. అలాగే గజ్వేల్ తో పాటు రాజేందర్ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తున్నందున ఈ ఎన్నికల్లో ఆయన ప్రధాన దృష్టి అంతా కూడా గజ్వేల్ పైనే సారించారు. గజ్వేల్ లో కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకేతను తనకు అనుకూలంగా మల్చుకోవాలన్న లక్ష్యంతో ఈటల ఆ నియోజకవర్గంలోనే ప్రచారం చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుని తిరుగుతున్నారు. అత్యంత బలమైన అభ్యర్థిగా ఉన్న కేసీఆర్ ప్రత్యర్థిగా ఉండడంతో ఈటల రాజేందర్ ఇక్కడి ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్ గా ఎలా పర్యటిస్తున్నారో ఆ విధంగానే హుజురాబాద్ విషయంలో వ్యవహరించాల్సి వస్తోంది ఈటలకు.

సొంతింటి బాధ్యతలు…

ఇకపోతే ఈటల సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో ప్రచార బాధ్యతలు ఆయన సతీమణి జమునారెడ్డికి అప్పగించారు. ఇక్కడికి ప్రచారం చేసేందుకు వస్తూ వెల్తున్న రాజేందర్ గెలుపే లక్ష్యంగా జమునారెడ్డి పని చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ జమునారెడ్డి ప్రచార బాధ్యతలు తనపై వేసుకున్నప్పటికీ తన భర్త ఈటల రాజేందర్ ప్రత్యక్ష్య పర్యవేక్షణలో తిరిగే వారు. ఇంటింటికి తిరుగుతూ, మహిళలతో పాటు సన్నిహిత కుటుంబాలతో కలిసి నియోజకవర్గం అంతా కలియ తిరుగుతూ ప్రచారం చేసేవారు. అయితే ఈ సారి మాత్రం జమునా రెడ్డికి ఈ బాధ్యతలు మరింత ఎక్కువయ్యాయనే చెప్పాలి. అభ్యర్థి అయిన తన భర్త రాజేందర్ గజ్వేల్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి రావడంతో పాటు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఇంఛార్జిగా కూడా ఉన్న ఆయన రాష్ట్రం అంతా తిరగాల్సి వస్తున్నందున హుజురాబాద్ సమీకరణాలన్ని కూడా జమున రెడ్డి పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో అటు ప్రచారం నిర్వహిస్తుండడం ఇటు ప్రత్యర్థి పార్టీల ఎత్తులను తిప్పి కొట్టడం వంటి చర్యల్లో నిమగ్నం కావల్సి వస్తోంది. సింగిల్ హ్యాండ్ తో తన భర్తను గెలిపించాలన్న తపనతో ముందుకు సాగుతున్న జమునా రెడ్డి వ్యూహాలు ఫలిస్తాయా లేదా అన్నది చూడాలి.

You cannot copy content of this page